రేవంత్ రివర్స్ ... బాబు యాక్షన్...?

Update: 2017-10-27 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. విదేశీపర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు టీటీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రేవంత్ వ్యవహారంపై చర్చించనున్నారు. పయ్యావుల కేశవ్ ఇప్పటికే రేవంత్ రెడ్డి గత ఆరు నెలలుగా ఢిల్లీ పర్యటనలు ఎందుకు చేస్తుందీ... తనవద్ద ఉన్న సమాచారాన్ని చంద్రబాబుకు పంపారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ గత కొద్దిరోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నివేదికను సిద్ధం చేశారు. రేవంత్ వ్యవహార శైలి వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందంటున్నారు టీటీడీపీ నేతలు. క్యాడర్ లోనూ అయోమయం నెలకొందన్నారు. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డిపై చంద్రబాబు ఈరోజు చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది.

రేవంత్ కు అపాయింట్ మెంట్ ఇస్తారా?

అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిసి అన్ని విషయాలు వివరిస్తానని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. తాను ఎవరికీ జవాబుదారీకానని, ఒక్క చంద్రబాబుకు మాత్రమే తాను సమాధానం చెబుతానని అంటున్నారు. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డికి చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్నది కూడా సందేహమే. ఎందుకంటే రేవంత్ ఇప్పటికే పూర్తిగా బయటపడిపోయారు. ఏపీ మంత్రులను టార్గెట్ చేయడం, కాంగ్రెస్ నేతలను కలవడంతో దాదాపు ఆయన ఎగ్జిట్ ఖాయమైపోయిందనే చెప్పాలి. అయితే రేవంత్ నిన్న కూడా టీటీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు లేని సమయంలో చూసి తనను పదవుల నుంచి తొలగించడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు తనకు ఏ విషయమూ చెప్పలేదంటున్నారు. ప్రజాసమస్యలపై స్టార్ హోటల్ లో సమావేశాలేంటని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన ఆ సమావేశానికి తాను వెళ్లనని కూడా చెప్పారు. కేసీఆర్ పెట్టే భోజనం తాను తినడం ఇష్టంలేదని కూడా కటువుగా వ్యాఖ్యానించారు. ఉదయం పార్టీ ఆఫీసులో ఉండి రాత్రికి కేసీఆర్ వద్దకు వెళ్లే వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దీంతో రేవంత్ పై ఈరోజు వేటు పడటం ఖాయంగా కన్పిస్తుంది. మరి చంద్రబాబు నిర్ణయం కోసం తెలంగాణతమ్ముళ్లు వేచి చూస్తున్నారు.

Similar News