నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీలో రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని చర్చించనున్నారు. రేవంత్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారన్న సంగతి అందరికీ తెలిసిందే. రేవంత్ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఏపీ టీడీపీ నేతల బండారాన్ని బయటపెట్టడంతో ఏపీ టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. అయితే ఇందుకు చంద్రబాబు విదేశంలో ఉండి వ్యూహాన్ని రచిస్తున్నారు. టీ టీడీపీ నేతల చేతనే రేవంత్ కు కౌంటర్ ఇప్పించాలని చంద్రబాబు ఇక్కడి నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అందుకే అత్యవసరంగా టీటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కాసేపట్లో జరగనుంది. ఇందులో సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు.
రేవంత్ పై కౌంటర్ ఎటాక్.....
రేవంత్ పార్టీలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చామని, తర్వాత ఎమ్మెల్యేను చేశామని, అయినా రేవంత్ కు కృతజ్ఞత లేకుండా పార్టీ పై నిందలు వేస్తున్నారని రేవంత్ పై ఎటాక్ కు టీటీడీపీ నేతలు దిగనున్నారు. పార్టీలో ఎంతమందో సీనియర్ నేతలున్నప్పటికీ రేవంత్ కు వర్కింగ్ ప్రెసిండెంట్ పదవి ఇచ్చి చంద్రబాబు ఆయనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేయనున్నారు. దీంతో పాటు రేవంత్ తో ఎవరెవరు? పార్టీని వీడి వెళ్లే అవకాశముంది? వారిని ఆపేందుకు ఎవరిని రంగంలోకి దించాలన్న వ్యూహాన్ని ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. మొత్తం మీద రేవంత్ పై ముందుగానే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? లేక విమర్శలకు దిగుతారా? అన్నది కాసేపట్లో తేలనుంది.