రేవంత్ వ్యవహారం ఎటూ తేలలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తో టీటీడీపీ పొలిట్ బ్యూరో కేంద్రకమిటీ లేక్ వ్యూ అతిధి గృహంలో సమావేశమయింది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. దీంతో రేవంత్ వ్యవహారంపై ఈరోజు అటో ఇటో తేలుతుందనుకున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు మూడు గంటలు సాగింది. అయితే చంద్రబాబు ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రేవంత్ వ్యవహారంపై చర్చిండానికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో చంద్రబాబు టీటీడీపీ నేతల అభిప్రాయాలను సేకరించారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమై వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారనుకున్నారు.
రేపు ఉయం అమదరావతిలో భేటీ....
ఈరోజు ఉదయం చంద్రబాబును టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఒక్కరే చంద్రబాబును కలుసుకున్నారు. ఆయనతో అన్ని విషయాలనూ చర్చించారు. అయితే లేక్ వ్యూలో జరిగిన సమావేశంలో ముఖ్యంగా మోత్కుపల్లి నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ లు రేవంత్ ను వదిలేస్తే పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుందని నేరుగా చెప్పటంతో వారిని చంద్రబాబు వారించినట్లు సమాచారం. తొందరపడి నిందలు వేయవద్దని, తాను రేవంత్ తో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రేవంత్ కూడా చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను రేవంత్ చంద్రబాబుకు వివరించారు. తన అభిప్రాయాలను చంద్రబాబు వద్ద కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. చివరకు సమావేశాన్ని ముగించారు చంద్రబాబు. రేపు పది గంటలకు టీటీడీపీ నేతలందరినీ అమరావతికి రావాల్సిందిగా ఆదేశించారు. రేపు రేవంత్ విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే రేపు రేవంత్ అమరావతికి వెళతారా? లేదా? అన్నది సస్పెన్స్.