రేవంత్ ను ఇక వదిలిపెట్టకూడదని...!

Update: 2017-12-22 03:30 GMT

రేవంత్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ కు ఊపు పెరిగింది. అంతేకాదు టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధమూ మొదలయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ ది. రేవంత్ దూకుడుకు కళ్లెం వేయాలంటే తామూ మాటల దాడికి దిగక తప్పదని టీఆర్ఎస్ గ్రహించినట్లుంది. అందుకే ఇక రేవంత్ ను చీల్చి చెండాలేయని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. మౌనంగా ఉంటే రేవంత్ రెచ్చిపోతున్నారని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే రేవంత్ కు ధీటుగానే ప్రతి విమర్శలు చేయమని గులాబీ నేతలకు ఆదేశాలు అందాయి.

లక్ష్మారెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు...

రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సభకు అనేకమంది కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో పాటు వీహెచ్ లాంటి నేతలు ఉన్నారు. అయితే జడ్చర్ల సభలో రేవంత్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపైనే కాకుండా ఈసారి ఆజిల్లాకు చెందిన మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ టోన్ పెంచేశారు. వంద పడకల ఆసుపత్రి కూడా తేలేని దద్దమ్మ అని మంత్రిని వ్యాఖ్యానించారు. అంతేకాదు లక్ష్మారెడ్డి డాక్టర్ చదువుకోలేదని ఆయన మున్నాభాయ్ ఎంబీబీఎస్ అని ఎద్దేవా చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ కన్నా తక్కువని హేళనగా మాట్లాడారు.

రేవంత్ కు వార్నింగ్....

దీంతో మంత్రి లక్ష్మారెడ్డితో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు రేవంత్ పై ఎదురుదాడికి దిగారు. ఏదైనా రాజకీయంగా విమర్శలు చేయాలని, వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. జడ్చర్ల సభకు కనీసం మూడు వేల మంది కూడా రాలేదని, ఆ సభలో రేవంత్ ఒక జోకర్ లా ఉన్నారన్నారు. అలాగే తన కుటుంబం మొదటి నుంచి వ్యవసాయం చేస్తూ సంపాదించిందని, తనకు వ్యాపారాలున్నాయని, కాని గోడల మీద రాతలు రాసుకునే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు మించిన ఇంటిని ఎలా కట్టుకున్నారో చెప్పాలని తీవ్రంగా విమర్శించారు.

Similar News