టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి వెంట వెళ్లేవారిని ఆపేందుకు టీటీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా లోకేష్ స్వయంగా దీనిని పర్యవేక్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి వెళ్లడం ఖాయమై పోయింది. దీంతో అమరావతిలో ఉన్న హైకమాండ్ ఇక్కడి నేతలను అలర్ట్ చేసింది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండటంతో లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటారని సమాచారం. రేవంత్ వెంట దాదాపు తెలంగాణలోని 20 జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు వెళ్లిపోతారన్న అనుమానాలు టీటీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు ముఖ్యనేతలతో పాటు మరికొందరు జిల్లాలకు చెందిన నేతలను కూడా భారీగానే తీసుకు వెళ్లేందుకు రేవంత్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అందుకోసమే లోకేష్ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే మకాం వేసి తెలంగాణలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, నేతలతో మాట్లాడతారని తెలుస్తోంది. శని, ఆదివారాలు ఎటూ సెలవు దినాలు కావడంతో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.
20 మంది జిల్లా అధ్యక్షులు.....
రేవంత్ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. తాను ఒంటరిగా వెళితే కాంగ్రెస్ లో పరపతి దక్కదని భావించిన రేవంత్ గత కొన్నాళ్లుగా తనకు అనుకూలురైన నేతలతో ఈ విషయాన్ని ముందుగానే చెప్పారు. దాదాపు 20 జిల్లాలకు చెందిన అధ్యక్షులు రేవంత్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. వారికి కాంగ్రెస్ లో ఎలాంటి అవకాశాలు కల్పిస్తామన్న విషయాన్ని కూడా రేవంత్ వారికి సమాచారం ఇచ్చారు. వారికి పూర్తి భరోసా ఇవ్వడంతోనే రేవంత్ వెంట పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ వెంట మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట, భూపాలపల్లి, వరంగల్, సిద్ధిపేట, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలు రేవంత్ వెంట పార్టీని వీడే అవకాశముందని తెలియడంతో లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. వారిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరితో పాటు కొందరు మాజీ ఎమ్మెల్యేలను కూడా రేవంత్ తీసుకెళుతున్నారు. మొత్తం మీద రేవంత్ మాత్రం భారీ బందోబస్తుతోనే పార్టీని వీడి వెళుతున్నట్లు తెలుస్తోంది.