దాదాపు చాలా కాలం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోకి అడుగుపెట్టారు. రాష్ట్ర విభజన జరగడం.. రాజధాని అమరావతికి తరలించిన తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రాలేదు. ఎప్పుడైనా పార్టీ నేతలతో మాట్లాడాలంటే లేక్ వ్యూ అతిథి గృహాన్నే చంద్రబాబు వేదికగా చేసుకునే వారు. ఇక మహానాడు కార్యక్రమానికి హాజరైనా అది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగింది. దీంతో చంద్రబాబు దాదాపు చాలా కాలం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రావడమే మానేశారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే రేవంత్ ఎపిసోడ్ తో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు అడుగుపెట్టక తప్పలేదు. గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన చంద్రబాబు చాలా రోజుల తర్వాత కార్యాలయానికి వచ్చారని అక్కడ సిబ్బంది కూడా గుసగుసలాడుకున్నారు.
ఏడాదిన్నర తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు....
రాజధాని అమరావతికి తరలి వెళ్లడం, అక్కడ పార్టీయే ప్రధమ ప్రాధాన్యం ఇవ్వడంతో చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశంపార్టీని మొబైల్ లోనే నడిపించేవారు. వారంతంలో హైదరాబాద్ వచ్చినా ఇంటికే పరిమితమయ్యేవారు. తెలంగాణ తెలుగుదేశం నేతలను ఇంటివద్దో... లేక్ వ్యూ అతిధి గృహం వద్దనో కలుసుకుని మాట్లాడే వారు. ఏదైనా అత్యవసరంగా మాట్లాడాలనుకుంటే అమరావతికే తెలుగు తమ్ముళ్లను ఆహ్వానించేవారు. చంద్రబాబు తనయుడు లోకేష్ మంత్రి పదవి చేపట్టక ముందు లోకేష్ ట్రస్ట్ భవన్ కు వచ్చి నేతలతో సమావేశమయ్యేవారు. ఆయన కూడా మంత్రి పదవి చేపట్టిన తర్వాత బిజీగా మారిపోయారు. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు వచ్చి దాదాపు ఏడాదికి పైగా గడిచిపోయిందని కొందరు గుర్తు చేసుకుంటున్నారు. కాని ఈసారి మాత్రం రాక తప్పలేదు. ఇకపై ప్రతి నెల ట్రస్ట్ భవన్ కు వచ్చేందుకు చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం మీద రేవంత్ కొట్టిన దెబ్బకు చంద్రబాబుకు పార్టీకార్యాలయం కన్పించిందన్న గుసగుసలు ఆ పార్టీ నేతల్లోనే విన్పిస్తున్నాయి.