తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పెద్దయెత్తున ఎదురుదెబ్బ తగలబోతోంది. రేవంత్ రెడ్డి తో దాదాపు 30 మందికి పైగానే నేతలు పార్టీని వీడనున్నారు. ఈరోజే కొందరు రాజీనామా చేయగా మరికొందరు రెండు రోజుల్లో పార్టీని వీడనున్నారు. వచ్చే నెల 2వ తేదీన పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఈలోగానే పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి నవంబరు 9వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా పార్టీలో చేరాలని భావించారు. అయితే చంద్రబాబు మళ్లీ హైదరాబాద్ లో సమావేశం 2వ తేదీన నిర్వహిస్తుండటంతో తమ అనుచరులతో కలిసి పెద్దయెత్తున కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు వచ్చి నేతలతో మాట్లాడక ముందే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను స్వీప్ చేసేందుకు రేవంత్ సిద్ధమయినట్లు సమాచారం.
చంద్రబాబు వచ్చే లోగానే....
ఆదివారం కొందరు టీడీపీ నేతలు రాజీనామా చేశారు. అచ్చంపేట నియోజకవర్గ ఇన్ ఛార్జి వెంకటేష్, టీడీపీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన రెడ్డి, బాల్కొండ టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి రాజారామ్ యాదవ్ పసుపు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ సాయంత్రంలోగా మరికొందరు నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేయనున్నారు. రేవంత్ కూడా ఈరోజు కాంగ్రెస్ నేతలతో సమావేశమైన తర్వాత తనకు టచ్ లో ఉన్న కొందరు ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి తన వెంట వచ్చే వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో కూడా వివరించనున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా చేత కూడా వారికి హామీలు ఇప్పించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వచ్చే నెల 2వ తేదీ చంద్రబాబు హైదరాబాద్ వచ్చేలోగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సగం ఖాళీ అయ్యే పరిస్థితి కన్పిస్తోంది.