రాబోయే ఎన్నికలకు ముందే ఉప్పు నిప్పులా వున్న తెలంగాణ బిజెపి , టిడిపిలు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక్కటి అయ్యే పరిస్థితి ఎదురైయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు తెలంగాణ గడ్డపై సిద్ధం అంటూ ఇప్పటికే ప్రకటించిన కమలనాథులకు రేవంత్ కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న వార్త మింగుడు పడటంలేదు. అలాగే టిడిపి కి అసెంబ్లీలో అత్యల్ప బలం ఉండటం రేవంత్ ఏర్పాటు చేయబోయే టి టీడీఎల్పీ సమావేశాన్ని వీక్ చేయాలంటే బిజెపి తో కలిసి సమావేశం నిర్వహించక తప్పని పరిస్థితి దాపురించింది. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే పాలసీలో 2014 లో మిత్రపక్షాలు గా వుంటూ ఆ తరువాత ఇప్పుడు ఒకరికొకరు దూరంగా వుంటూ వస్తున్న టిడిపి, బిజెపిలు తమ ఉమ్మడి టార్గెట్ రేవంత్ అనే అంశాన్ని చెప్పక చెప్పాయి.
పోటా పోటీ సమావేశాలు......
టీటీడీఎల్పీ సమావేశాన్ని తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ ఏర్పాటు చేయడం పసుపు దళపతి చంద్రబాబును కలవరానికి గురిచేసింది . దాంతో ఆయన లండన్ నుంచే పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ . రమణకు తదుపరి డైరెక్షన్ ఇచ్చారు. రేవంత్ పెట్టబోయే సమావేశానికి ఎమ్యెల్యేలను వెళ్లకుండా అడ్డుకోవాలని ఆదేశించారు, అలాగే బిజెపితో కలిపి అసెంబ్లీలో అనుసరించే వ్యూహం రూపొందించాలని సూచించారు. అధ్యక్షుడు రమణ అదే పని చేసినా ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరవుతుండగా, రేవంత్ పెడుతున్న సమావేశానికి సండ్ర వీరవెంకటయ్య విచ్చేస్తారని సమాచారం అందింది. ఇది టిడిపి లో మరింత గుబులు రేపుతోంది. రేవంత్ , సండ్ర ఓటుకు నోటు కేసులో కీలక ముద్దాయిలుగా వున్నారు. రేవంత్ ఎపిసోడ్ తరువాత సండ్ర ఎటువైపు వుండబోతున్నారన్న అంశం తేలిపోయింది.
ఆసక్తి రేపుతున్న రేవంత్ సమావేశం ...
ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి నిర్వహించతలపెట్టిన సమావేశం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి తాను హాజరు అవుతున్నట్లు సండ్ర వీరవెంకటయ్య ప్రకటిస్తూ తనకు బీజేపీ టిడిపిలు నిర్వహించే సమావేశానికి ఆహ్వానం రాలేదని చెబుతున్నారు. అదే విధంగా రేవంత్ పెట్టె సమావేశానికి తనకు సమాచారం లేదని ఆర్ కృష్ణయ్య ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. దాంతో ఈరెండు సమావేశాలపై ఆసక్తి నెలకొంది. రేవంత్ పై చంద్రబాబు వచ్చాకా చర్చించి నిర్ణయం తీసుకుంటారని అప్పటివరకు ఆయనను భరించక తప్పడం లేదని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.