రేవంత్ తో విందు అంటేనే...?

Update: 2017-11-12 01:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ మంటలు లేస్తున్నాయి. ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఈ విషయంలో పార్టీ నేతల తీరుపై మనస్తాపం చెందుతున్నారు. రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సంపత్ కుమార్ తన ఇంటికి భోజనానికి పిలిచారు. అయితే ఇది జిల్లాలోని సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణకు ఇష్టం లేదు. దీంతో కొందరు పార్టీ నేతలు సంపత్ రేవంత్ ను భోజనానికి పిలవడమేంటని ప్రశ్నించారట. డీకే అరుణ సీరియస్ గా ఉన్నారని చెప్పారట. దీంతో రేవంత్ తో విందు భోజన కార్యక్రమాన్ని సంపత్ కుమార్ రద్దు చేసుకున్నారు.

విందును రద్దు చేసుకున్నా....

అయితే విందు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డితో కలిసి డీకే అరుణ ఒక కార్యక్రమంలో పాల్గొనడం సంపత్ కుమార్ కు మింగుడపడలేదు. దీంతో సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను భోజనానికి పిలిస్తే వద్దన్న డీకే అరుణే రేవంత్ తో కలిసి ఎలా కార్యక్రమంలో పాల్గొన్నారని తనను ప్రశ్నించిన నేతలను నిలదీశారు సంపత్ కుమార్. అందుకే శాసనసభలో నేతలు వ్యవహారశైలిపై ఆయన ఇటీవల మండిపడ్డారు. సంపత్ కుమార్ పార్టీని వీడతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్ లోకి ఇప్పటికే ఆయనకు ఆహ్వానం ఉందని చెబుతున్నారు. మొత్తం మీద రేవంత్ తో విందుభోజనం ఏర్పాట్లు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి ఆ ఎమ్మెల్యేకు.

Similar News