రేవంత్ తో పాటు ఈ టాప్ లీడర్ కూడానా?

Update: 2017-10-21 09:30 GMT

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెంట బీజేపీ నేత నాగం జనార్ధనరెడ్డి కూడా వెళుతున్నారా? నాగం కూడా కాంగ్రెస్ లో చేరతారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో సీనియర్. అయితే ఆయన రాష్ట్ర విభజన తర్వాత నాగం కమలం కండువాను కప్పుకున్నారు. అయితే కమలం పార్టీలో నాగం ఇమడలేక పోతున్నారు. గత కొంతకాలంగా ఈ విషయంపై నాగం తర్జన భర్జనపడుతున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు నాగం జనార్ధన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య సఖ్యత ఉండేది. నాగం జనార్ధన్ రెడ్డికి వేదికపైన సీటు తప్ప పెద్దగా పార్టీ పెద్దలు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. రాజకీయ అవగాహనలేని బీజేపీ కార్యాలయంలోని సిబ్బంది సయితం నాగంను పెద్దగా పట్టించుకోరు. దీంతో నాగం తీవ్ర మనస్థాపానికి గురయ్యారని సమాచారం. రేవంత్ రెడ్డి వెంట నాగం జనార్థన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వెళతారన్న ప్రచారం ఊపందుకుంది.

బీజేపీ అత్యవసర సమావేశం.....

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, పార్టీ అధ్కక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీశామని, ఇతర పార్టీల నుంచి నేతలు తమ పార్టీలోకి వస్తారని కాషాయ నేతలు డప్పు కొట్టుకుంటున్నారు. అమిత్ షాకు కూడా జాబితాను పంపామంటున్నారు. ఈ నేపథ్యంలో నాగం పార్టీని వీడితే పరువు పోతుందేమోనన్న బెంగ వారికి పట్టుకుంది. అందుకే ఈ సమావేశంలో నాగం విషయంపై చర్చించినట్లు తెలిసింది. అలాగే ఎన్.విఎస్ఎస్ ప్రభాకర్ రేవంత్ రెడ్డిని కలవడంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.

Similar News