రేవంత్ రెడ్డి తప్పు చేశారా? పార్టీకి రాజీనామా చేయడం వరకూ ఓకే. అలాగే ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసేశారు. కాని టీడీపీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలో తన ఎదుగుదలకు కారణమైన చంద్రబాబును విపరీతంగా రేవంత్ కీర్తించారు. అందులోనూ ఏం తప్పులేదు. ఎందుకంటే చంద్రబాబు వల్లనే కేవలం పదేళ్లలోనే పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగారు. అలాగే ఆయన టీడీపీని వెనకేసుకు రావడంలో కూడా ఏమాత్రం రాంగ్ అన్పించదు. కాని తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఏపీ ముఖ్యమంత్రికి వివరించడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.ముఖ్యంగా కేసీఆర్, కేసీఆర్ పాలనపై లేఖలో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు అన్ని పార్టీలో చర్చకు దారితీశాయి.
ఏపీకి వెళ్లి... తెలంగాణ పాలనపై....
తెలంగాణలో కేసీఆర్ పాలన అస్తవ్యస్థంగా ఉందని, కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని బెజవాడలో తమ నేతకు రాసిన లేఖలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ గిరిజన రైతులకు బేడీలు వేసిందని, భూపాలపల్లిలో గుత్తికోయలను చెట్లకు కొట్టేసి కొట్టారని, అసెంబ్లీలో సస్పెన్షన్లు నిత్యకృత్యమయ్యాయయని ఆయన ఆరోపించారు. తనపై కక్ష గట్టిన కేసీఆర్ అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు కూడా పంపారని, ప్రతిపక్షాల గొంతు నొక్కడమే థ్యేయంగా కేసీఆర్ పెట్టుకున్నారని రేవంత్ తన లేఖలో ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని ఏపీ ముఖ్యమంత్రి ముందు గోడు వెళ్లపోసుకోవడం రేవంత్ చేసిన పెద్ద తప్పుగా చెప్పుకుంటున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడటమే తన ముందున్న లక్ష్యమని ఆయన లేఖలో చెప్పుకొచ్చారు. రేవంత్ టీడీపీని వీడొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చేయొచ్చు. కాని రేవంత్ పాటించిన విధానం తెలంగాణ ప్రజలను అవమాన పర్చినట్లుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కేసీఆర్ పాలన గురించి ఏపీ ముఖ్యమంత్రి ముందు ఏకరవు పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద టీడీపీ అధినేతను పొగడ్తలతో ముంచెత్తి... కేసీఆర్ ను విమర్శంచడం రేవంత్ చేసిన తప్పుగా కొందరు అభివర్ణిస్తున్నారు.