కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత టిడిపి ఫైర్ గన్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా ..? అవుననే చెబుతున్నాయి ఆయన చర్యలు. పొద్దున లేస్తే చాలు ఇంతకాలం ఒంటికాలిపై కేసీఆర్ పై విరుచుకుపడిన రేవంత్ ఇప్పుడు తన సహజశైలికి భిన్నమైన రూట్ లో వెళుతున్నారు. మీడియా కు ఎక్కడం వదిలిపెట్టి కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు తెరతీస్తున్నారు. తనపై అసంతృప్తి వ్యక్తం చేసే వారిని గుర్తించి వారితో సఖ్యతగా మెలగడం ప్రారంభించారు. అది పూర్తి అయ్యాకా రెండో స్కెచ్ కి సిద్ధం అయ్యారు రేవంత్ రెడ్డి.
హస్తిన కేంద్రంగా ...
కాంగ్రెస్ రాజకీయాలన్నీ హస్తిన కేంద్రంగా 10 జానపధ్ చుట్టూ తిరుగుతాయన్నది జగమెరిగిన సత్యం. అందుకే రేవంత్ తరచూ హస్తిన వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలిసి వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు యువనేత రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టనుండటంతో రాహుల్ కోటరీ తో టచ్ లోకి వెళ్లిపోయారు రేవంత్. అందుకే కొంత కాలం గల్లీ రాజకీయాలు వదిలి ఢిల్లీ రాజకీయాల బాట పట్టారని రేవంత్ సన్నిహితుల వ్యాఖ్య. ఢిల్లీ లో రేవంత్ కి మంచి క్రేజ్ పార్టీలో ఉండటంతో అక్కడ చక్రం తిప్పగలిగితే చాలని రేవంత్ వ్యూహంగా తెలుస్తుంది. రాబోయే కీలక ఎన్నికల్లో తన వర్గానికి అధిక టికెట్లు ఇప్పించుకోవాలంటే ఇప్పటినుంచి పునాది గట్టిగా పడాలని భావించిన రేవంత్ ఆ దిశగా వడి వడి అడుగులు వేస్తూ సాగుతున్నారు. చూడాలి ఆయన ప్రయత్నాలు ఏమేరకు సానుకూలం అవుతాయో. మరోవైపు డేట్ ఫిక్స్ చేసుకున్నా... అప్పుడే బయటకు వస్తానని చెబుతున్నారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9వ తేదీ నుంచి రేవంత్ పూర్తిగా కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు.