తెలంగాణ లో టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సృష్టించిన తుఫాన్ నుంచి బయట పడక తెలుగుదేశం కిందా మీదా పడుతుంటే బిజెపి చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లిన చందంగా వుంది. రేవంత్ రెడ్డి టిడిపి ని వదిలిపెట్టాలని భావిస్తే కాంగ్రెస్ లోకి వెళ్లడం దేనికని బిజెపి బాధపడుతుంది. ఉందిగా బురదలోనుంచి పుట్టిన స్వచ్ఛమైన కమలం. మీరెందుకు అవినీతి మకిలి పార్టీలోకి వెళుతున్నారు. ఎవరు వచ్చినా మా పార్టీలోకి రావొచ్చు. మేం అందరిని కలుపేసుకుంటాం అంటూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం మారాయి.
తలుపులు తెరిచే ఉన్నాయని బిజెపి సంకేతాలు ...
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో బిజెపి ఒంటరిగా పోటీకి పూర్తి స్థాయిలో సిద్ధం అవుతుంది. అందులో భాగంగా ప్రభావవంతమైన నేతలకు వల విసిరే పనికి గత కొంతకాలంగా చేపట్టింది. నిజామాబాద్ లో డీఎస్ తనయుడిని సైతం కమలం ఆకర్షించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా , రాంమాధవ్ వంటి నేతల డైరెక్షన్ లో కమలనాధులు ఆపరేషన్ ఆకర్ష్ కి తెరతీశారు. కానీ బిజెపికి పెద్ద స్థాయిలో చేరికలు కానరావడం లేదు. టి ఆర్ ఎస్ కి, కాంగ్రెస్ కి మాత్రమే క్యూ కడుతున్నారు జంపింగ్ జపాంగ్ లు. దాంతో లక్ష్మణ్ లాంటి వారు మీడియా లోకి వచ్చి మరీ బాబు బిజెపి వుంది కదా ఇందులోకి వచ్చేయండి అంటూ డైరెక్ట్ గా వెల్కమ్ చెబుతున్నారు. ఇది టిడిపి కి కంటగింపుగా వుంది. మిత్రపక్షం తమ పార్టీ వారివైపు కన్నేయడంతో రాబోయే రోజుల్లో కమలం టిడిపి వారిని లాగడం ఖాయం గానే కనిపిస్తుంది.