రేవంత్ కు ఏమి హామీ ఇచ్చారు? పార్టీలో ఏ పదవి ఇవ్వబోతున్నారు. ఇదే తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ తో సమావేశమైన రేవంత్ తన డిమాండ్లను కొన్నింటిని ఆయన ముందుంచినట్లు తెలుస్తో్ంది. తనతో పాటు చేరిన నేతల పేర్లు... వారు గతంలో నిర్వహించిన పదవుల జాబితాను కూడా రేవంత్ రాహుల్ కు అందించారు. అయితే రేవంత్ సేవలను రాహుల్ విరివిగా ఉపయోగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ లో ఆయనకు మంచి పదవే లభిస్తుందని రేవంత్ అనుచరులు చెబుతున్నారు. రాహుల్ నుంచి ఆ మేరకు హామీ లభించిందంటున్నారు. రేవంత్ కు పార్టీ ప్రచార బాధ్యతలను ఇస్తారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. వచ్చే ఎన్నికల వరకూ ప్రచారం మొత్తం రేవంత్ నిర్వహించేందుకు పార్టీ హైకమాండ్ కూడా అంగీకరించినట్లు తెలిసింది.
కొందరిలో అసంతృప్తి......
మంచి వాగ్దాటి... పంచ్ డైలాగులతో ప్రజలను ఆకట్టుకునే రేవంత్ ను తురుపు ముక్కలా ఉపయోగించుకోవాలని రాహుల్ సయితం భావిస్తున్నారు. రాహుల్ కు అత్యంత సన్నిహితుడైన కొప్పుల రాజు సూచనల మేరకు ఆయనకు పీసీసీలో ముఖ్య పదవి లభిస్తుందని గాంధీభవన్ లో టాక్. అయితే మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రేవంత్ కు లభిస్తున్న ప్రచారంపై పెదవి విరుస్తున్నారు. సాక్షాత్తూ ప్రతిపక్ష నేత జానారెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వాడే.. బాహుబలి అని... పార్టీలో చేరగానే బాహుబలి కాలేడని జానారెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మీడియా మిత్రుల ఎదుట అనడం సీనియర్లలో నెలకొన్న అసంతృప్తికి కారణమంటున్నారు. మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి నేతలు ఇప్పటికీ రేవంత్ చేరికపై అసంతృప్తితో ఉన్నారు. వీరందరి అసంతృప్తి మధ్య రేవంత్ రేపటి నుంచి గ్రాండ్ ఓల్డ్ పార్టీలో నెట్లుకు రావాల్సి ఉంటుంది.