టీటీడీపీ పొలిట్ బ్యూరోసమావేశం రేవంత్ రెడ్డి లేకుండానే సమావేశమయింది. పొలిట్ బ్యూరోలో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తీర్మానం చేశారు పార్టీ నేతలు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ కూడా తెలంగాణా టీడీపీ నేతలు లేఖలు రాశారు. రేవంత్ రెడ్డి గత కొద్దిరోజులుగా తనపై వస్తున్న ప్రచారంపై స్పందించలేదని, అంటే ఆయన పార్టీ వీడి వెళ్లాలని స్పష్టమవుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఎలాంటి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వవొద్దని టీడీపీ అధినేత చంద్రబాబుకు టీటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం లేఖ రాసింది. ఆరు నెలలుగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారని, ముఖ్య నేతలను కలుస్తున్నారని లేఖలో టీటీడీపీ నేతలు పేర్కొన్నారు.
వేటు వేయాల్సిందే......
టీటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే చంద్రబాబు విదేశాల నుంచి వచ్చే ముందే వేటు పడే అవకాశముంది. రేవంత్ రెడ్డిపై గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిపై ఎక్కడా రేవంత్ స్పందించలేదు. ఇటీవల జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా మోత్కుపల్లి దీనిని ప్రస్తావించగా పూర్తి విషయాలు చంద్రబాబుతోనే చెబుతానని,ఇక ఎవరితో తాను పంచుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమై రేవంత్ పై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సూచించడం విశేషం. ఇక వేటు పడటమే తరువాయి. వేటు పడిన తర్వాత రేవంత్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.