రేవంత్ కు ఓకే చెప్పారా?

Update: 2017-11-21 07:30 GMT

రేవంత్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో పాదయాత్ర చేయడానికి రేవంత్ కు అనుమతి లభించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేరి ఇరవై రోజులవుతున్నా యాక్టివ్ గా లేరు. ఆయన తెలంగాణలో రాహుల్ గాంధీ సభ సందర్భంగా మరోసారి కండువా అధికారికంగా కప్పుకుని అప్పడు ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. రేవంత్ తో పాటు ఆయన వెంట చేరిన నేతలెవ్వరూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. అయితే రేవంత్ డిసెంబర్ 9వ తేదీ నుంచి రేవంత్ తెలంగాణలో పాదయాత్ర చేయాలని భావించారు. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ కు నూతనోత్తేజం తెస్తానని రేవంత్ ధీమాగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏక వ్యక్తి నిర్ణయాలుండవన్న సంగతి తెలిసిందే. దేనికైనా అధిష్టానం అనుమతి తప్పనిసరి. ఇందుకోసం రేవంత్ రాహుల్ సమక్షంలో పార్టీలో చేరినప్పటి నుంచి పాదయాత్రకు అనుమతి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

పాదయాత్ర కు గ్రీన్ సిగ్నల్....

ఇటీవల కుంతియా తన ఇంటికి వచ్చినప్పుడు కూడా రేవంత్ పాదయాత్ర విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే తాను హైకమాండ్ తో మాట్లాడి ఏ విషయం తెలియజేస్తానని కుంతియా వెళ్లిపోయారు. అయితే కుంతియా నుంచి పాదయాత్ర చేసుకోవచ్చని రేవంత్ కు సమాచారం అందినట్లు చెబుతున్నారు. రాహుల్ పట్టాభిషేకం పూర్తయి తెలంగాణ పర్యటన తర్వాత రేవంత్ యాత్ర చేపట్టే అవకాశముంది. ఇంకా తేదీ ఖరారు కాకున్నా డిసెంబర్ 9వ తేదీన రేవంత్ పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. అయితే రేవంత్ పాదయాత్రపై కొందరు సీనియర్లు ఇప్పటికే అభ్యంతరం చెబుతున్నారు. రేవంత్ తన ఇమేజ్ ను పెంచుకోవడానికి పాదయాత్రను ఎంచుకున్నారని, అందుకు అనుమతి ఇవ్వవద్దని కొందరు హైకమాండ్ కు ఇప్పటికే తెలియజేసినట్లు తెలిసింది. అయినా సీనియర్ల మాటలను పట్టించుకోని అధిష్టానం రేవంత్ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సముద్రంలాంటి కాంగ్రెస్ లో రేవంత్ తాను ఒక నీటిబొట్టును కాదని నిరూపించుకోవాలని చేస్తున్న తొలి ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.

Similar News