రేవంత్ కాంగ్రెస్ లో మరో జగన్ అవుతారా?

Update: 2017-10-30 10:30 GMT

రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన భవిష్యత్ ఏంటి? మహాసముద్రమైన కాంగ్రెస్ లో ప్రస్తుతమున్న సీనియర్లను కాదని రేవంత్ కు ప్రాధాన్యత ఇస్తారా? రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ వద్ద తాను పార్టీలో చేరేందుకు ఏ షరతులను విధించారు. తన వెంట వచ్చే వారికి టిక్కెట్లు కన్ ఫర్మ్ చేసుకున్నారా? ఇదేప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న చర్చ. రేవంత్ రెడ్డి వెంట దాదాపు 30 మంది వరకూ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశముంది. అయితే వీరందరికీ టిక్కెట్లు అంటే హైకమాండ్ కు కూడా కత్తిమీద సామే. ప్రతి నియోజకవర్గంలోనూ గత మూడున్నరేళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న నేతలున్నారు. వారిని కాదని కొత్తగా వచ్చే వారికి టిక్కెట్లు ఇవ్వడమేంటే కష్టమైన పనే. మరి తన వెంట వచ్చిన వారికి రేవంత్ ఎలాంటి హామీ ఇవ్వనున్నారు. అయితే రేపు రాహుల్ తో సమావేశం సందర్భంగా రేవంత్ అన్ని విషయాలను ప్రస్తావించే అవకాశముంది.

రాహుల్ నుంచి హామీలు....

అయితే రేవంత్ కాంగ్రెస్ లో చేరడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ లో పెద్దపెద్ద ఇమేజ్ ఉన్న నేతలనే అధిష్టానం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. టీడీపీలో ఉన్నంత స్వేచ్ఛ కన్నా కాంగ్రెస్ లో ఎక్కువగా రేవంత్ కు లభించినా... పదవుల విషయంలో మాత్రం రేవంత్ ఢిల్లీని దేహి అనక తప్పదు. ఎందుకంటే తొలినుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేసే అవకాశం ఎంతమాత్రం లేదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు. షరతులతో కాంగ్రెస్ పార్టీలో ఎవరూ చేరరని, చేరలేరని పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీలో రేవంత్ ఒక్కరే నేత. కాని కాంగ్రెస్ లోమాత్రం పదుల సంఖ్యలో ఉన్న నేతల్లో రేవంత్ ఒకరు. అయితే గతంలో వైఎస్ జగన్ కు కాంగ్రెస్ లో జరిగిన పరాభావాన్ని కూడా కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. జగన్ కు ఎలాంటి అవకాశమివ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం ఆయన వేరే పార్టీ పెట్టుకునేలా చేసింది. అలాగే జగన్, రేవంత్ ల మనస్తత్వం కూడా ఒక్కటే. రేవంత్ దూకుడు గలిగిన వ్యక్తి. తన మాటే నెగ్గాలనుకునే స్వభావం కలిగిన రేవంత్ కాంగ్రెస్ లో ఇమడటం కష్టమేనంటున్నారు. మరి రేపు రాహుల్ వద్ద రేవంత్ ఎలాంటి హామీ పొంది వస్తారో చూడాలి. ఆయన వెంట వచ్చే నేతలు మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తున్నారు.

Similar News