రేవంత్ ఏం చెప్పనున్నారో...!

Update: 2017-10-27 05:30 GMT

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విదేశీపర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని కాసేపట్లో తేలిపోనుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీటీడీపీ ముఖ్యనేతలకు ఆహ్వానం అందింది. ఆహ్వానం అందిన వారిలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. సమావేశానికి రావాలని రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. రేవంత్ రెడ్డి నవంబర్ 9వ తేదీన కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వేటు ఖాయమే.....

అయితే రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా తాను అన్నీ విషయాలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతోనే మాట్లాడతానని చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు సమావేశానికి ఆహ్వానం అందడంతో రేవంత్ చంద్రబాబును కలిసి తనపై వస్తున్న ఆరోపణలకు నేరుగా చంద్రబాబుకే వివరణ ఇవ్వనున్నారు. చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చించడమే. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను రేవంత్ చంద్రబాబుకు వివరించనున్నట్లు సమాచారం. తాను ఏ పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నదన్న దానిపై క్లారిటీ కూడా ఇవ్వనున్నారు. రేవంత్ వివరణకు చంద్రబాబు సంతృప్తి చెందుతారా? లేదా? అన్నది పక్కన పెడితే... రేవంత్ పై వేటు వేయాల్సిందేనని టీటీడీపీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. రేవంత్ కూడా పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది.

Similar News