ఒక పక్క తెలంగాణ అసెంబ్లీ , మరోపక్క ఏపీలో వైసిపి అధినేత పాదయాత్ర , ఇంకోవైపు పొలిటికల్ స్క్రీన్ పైకి దూసుకొచ్చేందుకు సిద్ధమైన జనసేన. అమరావతి డిజైన్ల ప్రక్రియ కు తుది రూపు ఇవి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న టాపిక్స్. కానీ అందరి చూపు వీటికన్నా టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ మలుపులపైనే వుంది. తెలంగాణ లో ఏపీ పెద్దలు ప్రభుత్వం వెనుక చేరి కేసీఆర్ తో లాలూచీ పడుతున్నారని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ తేటతెల్లం చేయడమే ఈ ఆసక్తికి ప్రధాన కారణం. దాంతో ఏపీ తెలంగాణల్లో ప్రధాన అంశాలు అన్ని పక్కకు పోయి ఈ ఎపిసోడ్ తరువాత అంశాలు గా చేరిపోయాయి.
బాబు శుభం కార్డు వేసేస్తారా .......
టిటిడిపిని మాత్రమే కాదు ఏపీ టిడిపి కి నిద్ర లేకుండా చేసిన రేవంత్ రెడ్డి వ్యవహారానికి శుభం కార్డు వేసే పని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేతుల్లోనే వుంది. ఆయన రేవంత్ ను పిలిపించుకుని మాట్లాడటం ఒక ఎత్తు అయితే రెండవది తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు రమణ ఇచ్చిన నివేదికను ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించడం మరో ఎత్తు. రెండు వ్యూహాల్లో మొదటి ది సామరస్యంగా పూర్తి అవుతుంది . రెండవ ప్లాన్ అమలు చేస్తే రేవంత్ తరువాత చేసే వ్యాఖ్యలు మరింత డ్యామేజ్ ను క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా రేవంత్ చెలరేగిపోయారు. ఆయనే ఉండి ఉంటే ఇన్నిరోజులు ఈ ఎపిసోడ్ నడిచేది కాదని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు . శుక్రవారం తన విదేశీ పర్యటన ముగించుకుని నేరుగా టి టిడిపి ని గాడిన పెట్టె చర్యలను బాబు మొదలు పెట్టనున్నారు. అది ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి .