రేవంత్ ఎంట్రీకి ముందే.....?

Update: 2017-10-20 07:30 GMT

టీటీడీపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైపోయినట్లే చెప్పొచ్చు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చి కొన్ని హామీలను పొందిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను కలిసే బిజీగా ఉన్నారు. నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే తన జిల్లాకు చెందిన మరో ఫైర్ బ్రాండ్ డీకే అరుణను కలిసినట్లు తెలుస్తోంది. డీకే అరుణను కలిసి తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా మీకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయనని చెప్పినట్లు తెలిసింది. తాను టీడీపీని వీడి ఎందుకు కాంగ్రెస్ లోకి రావాల్సి వస్తుందో కూడా అరుణను కలిసి రేవంత్ వివరించినట్లు సమచారం. దాదాపు రెండున్నర గంటల పాటు అరుణతో సమావేశమైన రేవంత్ రెడ్డి అన్ని విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఒక జాబితాను రూపొందించుకున్నట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ నేతలను కలిసి......

నిన్న డీకే అరుణను కలిసిన రేవంత్ రెడ్డి ఈరోజు కోమటిరెడ్డి బ్రదర్స్ ను మరికొందరుసీనియర్ కాంగ్రెస్ నేతలను కూడా కలవనున్నారు. అయితే రేవంత్ రెడ్డి నేరుగా రాహుల్ తో భేటీ అయి తాను క్లియరెన్స్ తెచ్చుకోవడంతో కాంగ్రెస్ నేతలు కూడా ఏమీ చేయలేనిపరిస్థితుల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి రాకను ముఖ్యంగా డీకే అరుణ, కోమటిరెడ్డి బ్రదర్స్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలు వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కాంగ్రెస్ నేతలను కలిసే పనిలో పడ్డారు. వారికి తాను ఏ పరిస్థితుల్లో పార్టీకి వస్తుందీ, తన రాకవల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. తన వెంట ఎవరెవరు? కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందీ కూడా వారికి తెలియజెబుతున్నారు. మొత్తం మీద తన ఎంట్రీకి ముందే రేవంత్ కాంగ్రెస్ నేతలను కలిసి వ్యతిరేకతను రాకుండా చూసుకుంటున్నారన్నమాట.

Similar News