తెలంగాణ బిడ్డ రేణుకాచౌదరి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నప్పుడు రేణుక చౌదరి నవ్వడంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కూడా సీరియస్ అయ్యారు. ఆసుపత్రిలో చూపించుకోవాలని హితవు పలికారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అయితే రామాయణం సీరియల్ లో చూసిన నవ్వు గుర్తుకు వస్తుందని ఛలోక్తి విసిరారు. దీనిపై రేణుక అభ్యంతరం తెలిపారు. మహిళలను ప్రధాని మోడీ అవమానించారన్నారు. మోడీ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు.
ద్రౌపదిగా పోలుస్తూ పోస్టర్లు....
అలాగే కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అయితే ఒక అడుగు ముందుకేసి రేణుకను శూర్పణఖ గా వర్ణిస్తూ పోస్ట్ చేశారు. ఇది పెద్ద వివాదమే రేపింది. ఆతర్వాత ఆయన ఆ పోస్టును తొలగించారు. అయినా రేణుక చౌదరి కేంద్రమంత్రి పై హక్కుల నోటీసు ఇచ్చారు. ఈ వివాదం సమసి పోకముందే ఉత్తరప్రదేశ్ లో ఓ పోస్టర్ కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు హసీబ్ అహ్మద్ రేణుకను మహాభారతంలో ద్రౌపదిగా పోలుస్తూ ఒక పోస్టర్ వేయడం విశేషం. మోడీ చేసిన కామెంట్లకు ప్రతిగా ఆయన ఈ పోస్టర్ వేశారు.
అద్వానీ దృతరాష్ట్రుడిగా....
ఈ పోస్టర్ లో రేణుకను ద్రౌపదిగా పోల్చారు. మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజులను కౌరవులుగా పోల్చారు. బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని ధృతరాష్ఠ్రుడిగా చూపారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కృష్ణుడిగా అభివర్ణించారు. ఒక మహిళ నవ్వు 101 మంది కౌరవులు మరణించడానికి కారణమైందని కూడా ట్యాగ్ లైన్ జత చేశారు. మొత్తం మీద రేణుక నవ్వు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రేణుక చౌదరి తొలుత దీన్ని లైట్ గా తీసుకున్నప్పటికీ తర్వాత ఆమె విమర్శల దాడి పెంచారు.