జగన్ స్వరం పెంచాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో రేటింగ్ పెంచుకోవాలనుకుంటున్నారు. అందుకే పాదయాత్రలోనే ప్రత్యేకహోదా గళం విన్పిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన మరోసారి స్వరం పెంచారు. ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి ఉద్యమం చేస్తుంది వైసీపీ యేనని ఆయన చెబుతూ వస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటే ప్యాకేజీకి కక్కుర్తి పడి రాష్ట్ర ప్రభుత్వం ఏపీని సర్వ నాశనం చేసిందని విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదాపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఒకవైపు బీజేపీ విభజన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చాలని ముందుకొస్తున్న తరుణంలో మళ్లీ ఏపీ ప్రజల సెంటిమెంట్ ప్రత్యేక హోదాను రగిలించే ప్రయత్నంలో వైసీపీ ఉంది.
ప్రత్యేక హోదా కోసం....
ప్రత్యేక హోదా అనేది ఇచ్చేది కాదని కేంద్రం ఎప్పుడో తెగేసి చెప్పింది. కాని 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రణాళికాసంఘానికి కూడా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పంపింది. నీతిఅయోగ్ ద్వారా దానిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నది జగన్ ఆరోపణ. ఆనాటి ప్రధాని, ఈనాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకి విలువ లేదా? అని జగన్ ప్రశ్నిస్తున్నారు. చట్టంలో పేర్కొనకపోయినా రాజ్యసభలో ప్రధాని ప్రకటనే చట్టమని జగన్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై త్వరలోనే ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని జగన్ పార్టీ నేతలను ఆదేశించారు. బహిరంగ సభల్లో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ ప్రస్తావిస్తూ వస్తున్నారు.
పోరాటం తప్పదని....
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో బోడగుడిపాడులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ తన ఊపిరి ఉన్నంత వరకూ ప్రత్యేక హోదాకోసం పోరాడతానని ప్రకటించారు. ప్రతి జిల్లా హైదరాబాద్ లా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాను సాధించుకోవాల్సిందేనన్నారు. తెలంగాణ కోసం ఆ ప్రాంత ప్రజలు ఎన్నో కష్టనష్టాల కోర్చి సాధించుకున్నారని గుర్తు చేశారు. ఈరోజు కాకుంటే ఏదో ఒకరోజు అనుకున్నది సాధిస్తామని చెప్పారు. అందుకే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు జగన్ వెల్లడించారు. మొత్తం మీద జగన్ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో వస్తున్న కదలికలను గమనించే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.