రెండో సారి సీఎం అయినా ఆనందం లేదట...!

Update: 2017-12-29 17:30 GMT

రెండోసారి సీఎం అయ్యారనే కాని కుర్చీ మీద కుదురుగా కూర్చోలేని పరిస్థితి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీది ఇదే పరిస్థితి. బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కడంతో ఎమ్మెల్యేలు కోడిపుంజుల్లా కాలు దువ్వుతున్నారు. గుజరాత్ ముఖ్యమమంత్రిగా ఇటీవల విజయ్ రూపానీ ప్రమాణస్వీకారంచేసిన సంగతి తెలిసిందే. తొలుత విజయ్ రూపానీ స్థానంలో కొత్తవారిని తీసుకురావాలని భావించినా ఎందుకో అధిష్టానం చివరకు ఆయనవైపే మొగ్గు చూపింది. విజయ్ రూపానీ సారథ్యంలోనే 99 సీట్లు సాధించుకుని ఎట్టకేలకు అధికారంలోకి రాగలిగింది.

అలకపాన్పు ఎక్కిన డిప్యూటీ సీఎం...

విజయ్ రూపానీతో పాటు మరో 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్ కూడా గత ప్రభుత్వంలో మాదిరగానే కొనసాగారు. సాధారణంగా ప్రమాణ స్వీకారంచేసిన సాయంత్రానికి మంత్రులకు శాఖల కేటాయింపు జరుగుతుంది. కాని విజయరూపానీ మాత్రం రెండు రోజుల తర్వాత శాఖలను కేటాయించారు. అయితే ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ తనకు కేటాయించిన శాఖల పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. నితిన్ పటేల్ హోంశాఖను ఇస్తారని భావించారు. కాని హోంశాఖను విజయ్ రూపానీ తన వద్దనే ఉంచుకున్నారు. గతంలో నిర్వహించిన రెవెన్యూ, ఆర్థిక శాఖలను కూడా నితిన్ పటేల్ కు ఇవ్వలేదు. ఆయనకు రోడ్లు భవనాలు, ఆరోగ్యశాఖలను కేటాయించడంతో నితిన్ పటేల్ పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

మాజీ మంత్రి హెచ్చరికలు...

అలాగే గత మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న రాజేంద్ర త్రివేదికి ఈ సారి కేబినెట్లో స్థానం దక్కలేదు. దీంతో ఆయన ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. వడోధర ప్రాంతంలో ఎవరికీ మంత్రి పదవి దక్కలేదని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా తన వెంట పది మంది ఎమ్మెల్యేలున్నారని, అవసరమైతే కూల్చివేస్తానని పరోక్షంగా విజయ్ రూపానీకి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉన్న ఎమ్మెల్యేల్లో 7మంది జారిపోతే ఇక అంతే సంగతులు. అందుకే విజయ్ రూపానీ ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. అయితే అమిత్ షా, మోడీ ఇక్కడి వారే కావడంతో ఒకింత ధైర్యంగా ఉన్నారట.

Similar News