రెండేళ్లలో అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే

Update: 2016-11-24 12:01 GMT

రాయలసీమకు దక్కవలసిన రాజధాని అనే భాగ్యాన్ని దూరం చేసేసారనే భావన సీమ వాసుల్లో వీలైనంత త్వరగా రూపుమాపడానికి చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నట్లుంది. అనంతపురాన్ని అమరావతి నగరంతో అనుసంధానించే 6 లైన్ ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి.. వారిని సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో ఉన్నట్లుంది. గురువారం నాడు నిర్వహించిన సమీక్షలో.. ఆయన ఈ రహదారి నిర్మాణానికి అధికార్లకు డెడ్ లైన్ లు నిర్దేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండేళ్లలోగా దీనిని పూర్తి చేయాలని అంటున్నారు.

రాయలసీమ సమగ్ర అభివృద్ధిలో అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కీలకం కానున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారు.. రూ.27,600 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దేశంలో ఈ తరహా రహదారి నిర్మాణాలలో ట్రెండు సెట్టర్‌గా నిలవనున్నదని ఆయన తెలిపారు. ప్రస్తుతం 6 వరుసల రహదారిగా నిర్మిస్తున్నా భవిష్యత్ అవసరాలను దృష్టిలో వుంచుకుని 8 వరుసలకు సరిపడా స్థలాన్ని రిజర్వ్ చేసుకుని వుంచుకోవాలని గురువారం మధ్యాహ్నం పోలీస్ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో 5 జిల్లాల కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ తరువాత అత్యంత ప్రాధాన్యం గల ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ ప్రక్రియ ఇవాళ్టి నుంచే ఆరంభమైనట్టు ఆయన ప్రకటించారు. రెండేళ్లలో రహదారి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలే ఈ తరహా రహదారిని నిర్మించారని, దానికి భిన్నంగా అనంతపురం-అమరావతి 6 వరుసల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరగనున్నదని ముఖ్యమంత్రి వివరించారు. యూపీలో నిర్మించిన రహదారి 4 వరుసలతో 300 కిలోమీటర్ల మేర వుండగా, అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే 598.830 కిలోమీటర్ల పొడవుతో 6 వరుసలతో నిర్మాణం కానున్నది. అది కూడా ఎక్కడా ఎటువంటి మలుపులు లేకుండా, అక్కడక్కడ సొరంగ మార్గాలు, వంతెనలతో నిర్మించడం దేశంలో ఇదే ప్రథమమని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఎక్స్‌ప్రెస్ వేకు సమాంతరంగా రైల్వే ట్రాక్ కూడా నిర్మించనుండటం అదనపు ఆకర్షణ అని అన్నారు. కేంద్రం ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులను ఇవ్వడానికి అంగీకరించిందని, సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తున్నామని, రేపటి నుంచే సర్వే బృందాలను 5 జిల్లాలకు పంపిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని 5 జిల్లాలను నూతన రాజధానికి కలుపుతూ నిర్మించే ఈ రహదారి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చనున్నదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కరవు ప్రాంతమైన రాయలసీమ దశ మారిపోగలదని చెప్పారు. ఈ రహదారి ద్వారా బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ ప్రధాన నగరాలకు అనుసంధానం కలుగుతుందని చెప్పారు. అంతేకాకుండా, డెడికేటెడ్ ఇండస్ర్టియల్ టౌన్‌షిప్‌గా అవతరించనున్న దొనకొండకు, రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవుకు ఈ రహదారి దగ్గరగా వెళుతుందని తెలిపారు.

ఈ ఎక్స్‌ప్రెస్ మార్గానికి రెండువైపులా నీరు, ఖనిజ వనరులు పుష్కలంగా వున్న ప్రాంతాలలో చిన్నచిన్న పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ మార్గంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా వున్నాయో గుర్తించాలని ఆయన 5 జిల్లాల కలెక్టర్లకు సూచించారు. గుంటూరు జిల్లాలో 82.4 కిలోమీటర్లు, ప్రకాశం జిల్లాలో 226.9 కిలోమీటర్లు, కర్నూలు జిల్లాలో 160.6 కిలోమీటర్లు, కడప జిల్లాలో 64.2 కిలోమీటర్లు, అనంతపురం జిల్లాలో 68.6 కిలోమీటర్లు చొప్పున ఎక్స్‌ప్రెస్ వేలో కలుస్తాయి. కర్నూలుకు ఒక లైన్, కడపకు మరో లైన్ విడిగా వెళతాయి.

దేశంలోనే అతిపెద్దదైన ఈ రహదారి ప్రాజెక్టు కోసం మొత్తం 26,793 ఎకరాల భూమిని సేకరించాల్సి వుంటుంది. ఇందులో 9324 హెక్టార్ల భూమి అటవీభాగంలో వుంది. దీన్ని నోటిఫై చేయాలి. ఈ ప్రాజెక్టు కోసం ఆరు నెలల రికార్డు సమయంలో భూ సేకరణ లేదా సమీకరణ పూర్తి చేయాలని వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి 5 జిల్లాల కలెక్టర్లకు నిర్దేశించారు. మొత్తం నిర్మాణాన్ని సాథ్యమైనంత తక్కువ ఖర్చుతో చేపట్టాల్సి వున్నదని చెప్పారు. ముఖ్యంగా భూ సేకరణ నిమిత్తం సాధ్యమైనంత తక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సివుంటుందన్నారు. భూముల ధరలు ఎక్కువగా వున్న ప్రాంతాలలో భూ సమీకరణ విధానానికి వెళ్లాలని సూచించారు. రాజధాని తరహాలో భూ సమీకరణ చేపట్టడం ద్వారా ప్రాజెక్టు ఖర్చు తగ్గిపోతుందని చెప్పారు. దీనిపై కలెక్టర్లు శ్రద్ధ తీసుకుని ఆయా ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులతో మాట్లాడాలని సూచించారు. ఎవరూ నొచ్చుకోని రీతిలో నిరంతర సంప్రదింపులు జరిపి సమీకరణ పూర్తిచేయాలని అన్నారు.

అమరావతి, పోలవరం ప్రాజెక్టు తరువాత తన తదుపరి ప్రాధాన్యం ఇదేనని చెబుతూ, ఇకనుంచి వారం వారం ఈ ఎక్స్‌ప్రెస్ వే పురోగతిపై సమీక్షిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంపై అత్యున్నత స్థాయి కమిటీని నియమిస్తామని కూడా చెప్పారు.

Similar News