రెండు రోజులు రెస్ట్ లో జగన్...!

Update: 2018-02-09 01:30 GMT

వైఎస్ జగన్ పాదయాత్రకు రెండు రోజులు విరామమిచ్చినట్లయింది. గురువారం బంద్ కారణంగా యాత్రకు విరామమిచ్చిన జగన్, శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. గురువారం ఏపీ విభజన సమస్యల పరిష్కారంకోసం వామపక్షాలు ఇచ్చిన బంద్ కు వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బంద్ లో విద్యార్థులతో కలసి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసిన జగన్ తర్వాత ఆయన విమానంలో హైదరాబాద్ బయలు దేరి వచ్చారు. ఈరోజు ఆయన సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

నిన్న మధ్యాహ్నం వరకే....

గురువారం మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకున్న జగన్ పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ నేతలతో చర్చించారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డితో ఆయన ఫోన్లో మాట్లాడారు. రాజ్యసభలో జరిగిన అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని జగన్ ఎంపీలను ఆదేశించారు. అంతేకాకుండా విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనను టీడీపీ తీసుకురాలేకపోయిందని కూడా జగన్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపైన కూడా జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.

యాత్ర ఆలస్యమయ్యే అవకాశం....

ఇక ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. రెండు రోజుల విరామం అనంతరం శనివారం తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే జగన్ కొలిమర్ల క్రాస్ రోడ్స్ వద్ద 1100 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. జగన్ పాదయాత్రకు ఇటీవల కాలంలో ఎక్కువగా బ్రేకులు ఇస్తున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండగరోజు, జనవరి 14 సంక్రాంతి పండగకు జగన్ పాదయాత్ర చేయలేదు. అలాగే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో ఆయన ఆరోజు పాదయాత్రకు విరామం ప్రకటిస్తూ వస్తున్నారు. గురువారం బంద్ సందర్భంగా యాత్ర చేయలేదు. దీంతో జగన్ యాత్ర అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకునే అవకాశముంది. నెల్లూరు జిల్లా తర్వాత పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది.

Similar News