అన్నాడీఎంకేను అప్రతిహతంగా నడిపిన జయలలిత మరణించడంతో ఆ పార్టీ రెండు ముక్కలై పోయింది. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. అధికారంలో ఉండి కూడా ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటమిపాలయింది. ఇక ప్రతిపక్ష డీఎంకే పరిస్థితి కూడా అంతేమాదిరిగా తయారైంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకపోవడంతో పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.
స్వరం పెంచిన ఆళగిరి...
జయ మరణించడంతో అన్నాడీఎంకే ముక్కలయింది సరే.. ఇక డీఎంకే పరిస్థితి కూడా అలాగే మారింది. డీఎంకే అధినేత కరుణానిధి పూర్తిగా మంచంపట్టేశారు. ఆయన కదలలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీని ఆయన తన చిన్నకుమారుడు స్టాలిన్ కు అప్పగించారు. స్టాలిన్ ను డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గాచేశారు. కాని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోవడంతో కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి స్వరం పెంచారు. స్టాలిన్ కు పార్టీని నడిపే సత్తా లేదని తేల్చారు. స్టాలిన్ ఉన్నంతవరకూ పార్టీ గెలిచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కరుణానిధి కొడుకుల మధ్య వార్ మళ్లీ మొదలయిందనే చెప్పొచ్చు.
రేపు పార్టీ సమావేశం....
వాస్తవానికి తమిళనాడులో ఏ ఎన్నిక జరిగినా పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుంది. మూడో పార్టీకి అవకాశం ఉండదు. గత యాభై ఏళ్లుగా తమిళనాట అదే జరుగుతుంది. కాని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకే ఓటు బ్యాంకు కనుమరుగై పోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో శుక్రవారం పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు స్టాలిన్. ఈ సమావేశంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ చేయనున్నారు.
అన్నదమ్ముల పోరు ఈనాటిది కాదు....
ఇక స్టాలిన్ కు, ఆళగిరికి మధ్య విభేదాలు ఈనాటివి కావు. అయితే టిక్కెట్ల కేటాయింపు విషయంలోనే తేడా వచ్చింది. డీఎంకే అధికారంలో ఉన్నా లేకున్నా కలిసి ఉన్న అన్నదమ్ములిద్దరికి కేవలం టిక్కెట్ల పంపిణీ విషయంలోనే తేడా వచ్చింది. ఆళగిరి పంపిన జాబితాను అప్పట్లో స్టాలిన్ అడ్డుకోవడంతో ఆయన పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో ఆళగిరిని పార్టీ నుంచి కరుణానిధి సస్పెండ్ చేశారు. కొంతకాలం మౌనంగానే ఉన్న ఆళగిరి 2016 ఎన్నికల సమయంలోనూ ఇచ్చిన లిస్ట్ ను కరుణానిధి తిరస్కరించారు. దీంతో ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు. కొన్నాళ్ల నుంచి ఆళగిరి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాని ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫలితం తర్వాత తిరిగి ఆళగిరి లైన్లోకి వచ్చారు. స్టాలిన్ పై విరుచుకుపడ్డారు. డీఎంకేలో ఒక వర్గం ఇప్పటికీ ఆళగిరి వెంటే ఉంది. ఆయనకు మధురై ప్రాంతాల్లో గట్టి పట్టుంది. దీంతో డీఎంకే కూడా రెండుగా చీలిపోతుందేమోనన్న ఆందోళన పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే రేపు స్టాలిన్ అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 2జీ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన కనిమొళికి పార్టీలో పదవి కేటాయించడం, ఆళగిరి చేసిన వ్యాఖ్యలపై చర్చించనున్నారు.