రెండాకుల గుర్తుపై ఎన్నికల కమిషన్ ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 23వ తేదీన రెండాకుల గుర్తు ఎవరికి కేటాయించాలన్న దానిపై ఎన్నికల కమిషన్ నిర్ణయించాల్సి ఉన్నా... దానిని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. తమిళనాడులోని అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో పన్నీర్ సెల్వం వేరే వర్గంగా ఉన్నారు. ఆయన కూడా గుర్తు తమకే దక్కాలని ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఒక్కటయ్యారు. శశికళ వర్గం కూడా ఎన్నికల గుర్తు తమకే కేటాయించాలని కోరుతోంది.
నేడు ఈసీ నిర్ణయం...
ఈ నేపథ్యంలో ఈరోజు ఈసీ ప్రకటించే నిర్ణయం పైనే రెండు వర్గాల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. శశికళ జైలు నుంచే ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. తనను తొలగిస్తూ, వేరే నియామకాలు చేపడుతూ తీసుకున్న నిర్ణయం సాంకేతికంగా చెల్లదని శశికళ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. మరోవైపు పళని, పన్నీర్ వర్గాలు మాత్రం రెండాకుల గుర్తు తమదేనన్న ధీమాతో ఉన్నారు. దాదాపు 1800 అఫడవిట్లు సమర్పించామని, శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో గుర్తు తమకే దక్కాలంటున్నారు. అయితే ఆ అఫడవిట్లన్నీ బోగస్ వేనని శశికళ వర్గం వాదిస్తోంది. మొత్తం మీద ఈరోజు ఈసీ రెండాకుల గుర్తపై ఒక నిర్ణయం ప్రకటించనుంది.