రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేల్లో తాను రెంటికీ చెడిపోయానని తల పట్టుకుంటున్నాడు విజయవాడ పశ్చిమ నియోజకవ ర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన జలీల్.. తర్వాత చంద్రబాబు ఆకర్ష్ మంత్రానికి ముగ్ధుడై.. జగన్‌కు ఝలక్ ఇచ్చి.. టీడీపీ పంచన చేరాడు. ఈ క్రమంలోనే ఆయనకు రెండు పదవులపై హామీ లభించిందనేది పెద్ద సంచల నంగా నిలిచింది. ఒకటి చంద్రబాబు కేబినెట్‌లో మైనార్టీ శాఖ మంత్రి పదవి కాగా, రెండు వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి. దీంతో వెంటనే పార్టీ మారి చంద్రబాబుకు మద్దతుగా జగన్‌పై తీవ్ర విమర్శలు సైతం గుప్పించాడు జలీల్ ఖాన్. త్వరలోనే తనకు పదవులు లభిస్తాయని పెద్ద ఎత్తున హడావుడి కూడా చేశాడు. పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్నదానాలు కూడా చేశాడు.
మంత్రిపదవి దక్కక....
గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో జలీల్ ఖాన్ తనకు పదవి ఖాయమని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయన నోటి దురదే ఆయనకు ఆ పదవిని దూరం చేసింది. ఆన్‌లైన్ ఛానెల్ ప్రతినిధి చేసిన ఇంటర్వ్యూ లో బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసి రాష్ట్రం మొత్తానికి కితకితలు పెట్టారు. దీంతో చంద్రబాబు ఇలాంటి నాకన్నా అపరమేధావిని కేబినెట్‌లోకి తీసుకుంటే తిప్పలు తప్పవని భావించి.. పక్కకు పెట్టారు. దీంతో జలీల్ ఖాన్ ఫస్ట్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు అయింది. దీంతో జలీల్ ఖాన్ ఇక, కనీసం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవితోనైనా సరిపెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా నుంచి ఒకరిని వక్ఫ్ బోర్డు సభ్యుడిగా ఎన్నుకుంటారు. ఆ సభ్యుడితో పాటు ఇంకా ఎనిమిది మంది సభ్యులుగా ఉంటారు.
రెండో పదవి కూడా రాకపోయె...
వీరిలో ఒకరిని మిగిలిన సభ్యులు చైర్మన్‌గా ఎన్నికుంటారు. అయితే, ఎమ్మెల్సీ గురించి పట్టించుకోకుండా కేవలం ఎమ్మెల్యేలకు జలీల్‌ఖాన్‌ను మాత్రమే సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా కోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు ప్రస్తుతానికి హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో జలీల్‌ఖాన్‌కు కనీసం చైర్మన్ పదవి కూడా దక్కలేదు. దీంతో అటు మంత్రి పదవి, ఇటు బోర్డు చైర్మన్ గిరీ కూడా దక్కక పోవడంతో రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోయారు. దీంతో ప్రస్తుతం కిం కర్తవ్యం? అనుకుంటూ.. ఆయన ఇంటికే పరిమితమయ్యారని సమాచారం. తీవ్ర మనస్థాపంతో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదనే సమాచారం చంద్రబాబుకు చేరడంతో ఇటీవల ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. అయినప్పటికీ.. జలీల్ ఖాన్ పదవుల రగడ చల్లారడం లేదు. మరి వచ్చే ఎన్నికల నాటికి ఏం చేస్తాడో చూడాలి.