రాహుల్ రాటు దేలారు. ట్విట్టర్లో మోడీపై విరుచుకుపడటం... ఎద్దేవా చేస్తున్న రాహుల్... వచ్చే నెల 8వ తేదీన దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయడానికి పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ పార్టీ కార్యాలయంలో జనరల్ సెక్రటరీలతో సమావేశమయ్యారు. నవంబరు 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 8వ తేదీన దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో నిరసనలు విన్నూత్న రీతిలో తెలియజేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏకే ఆంటోని, మోతీలాల్ ఓరాతో ఒక కమిటీని నియమించారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నదీ, ధరల పెరుగుదల, నిత్యవసర వస్తువుల ధరలు నింగినంటడం వంటి వాటపై మోడీ సర్కార్ పై యుద్ధం చేయాలని నిశ్చయించారు.
నవంబరు 8 దుర్దినం.....
రాహుల్ వచ్చే నెల మొదటి వారంలోనే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. తాను అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జరిగే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేపట్టాలని, ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ శ్రేణులంతా వెళ్లాలని రాహుల్ నిర్ణయించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు రాహుల్. పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి ఏమాత్రం తగ్గలేదని, అంతేకాకుండా నల్ల కుబేరులు కూడా ఎవరూ బయటకు రాలేదని రాహుల్ ఆరోపించారు. కేవలంల మోడీ స్వప్రయోజనాలకే ఈ రెండు కార్యక్రమాలు చేపట్టారన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు రెండూ విధ్వంసక ఆయుధాలుగా రాహుల్ ఆరోపించారు. నవంబరు 8వ తేదీన దేశ వ్యాప్తంగా దుర్దినంగా పాటించాలని రాహుల్ పిలుపునిచ్చారు.అయితే కేంద్ర ప్రభుత్వం నవంబరు 8వ తేదీన నల్లధనం వ్యతిరేక దినంగా ప్రకటించడం విశేషం.