రాహుల్ పదునుతేరారు

Update: 2018-03-19 17:30 GMT

అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ రాజకీయాల్లో రాటుతేలారు. తాజాగా జరుగుతున్న ఎఐసిసి సదస్సులో రాహుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై నిప్పులు చెరిగేశారు. గతానికి భిన్నంగా రాహుల్ ప్రసంగం చక్కటి హావభావాలతో మొదలు పెట్టడం విశేషం. మోడీ చేస్తున్న పనులను ఒక్కటొక్కటిగా వివరిస్తూ మాటలను తూటాల్లా పేల్చేస్తున్నారు రాహుల్. తమ కొత్త అధ్యక్షుడి ఒరవడికి ముఖ్యంగా ప్రసంగానికి కాంగ్రెస్ శ్రేణులన్నీ ఫిదా అయిపోతున్నాయి.

దేశంలో ఏ సమస్య ముందుకొచ్చినా మోడీ యోగా అంటూ ...

ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నిరుద్యోగులు ఉపాధి లేక తిప్పలు పడుతున్నా, ఆ సమస్యలనుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు చలో ఢిల్లీ గేట్ యోగా చేద్దామంటూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు అమాయకులు కాదని రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా గుణపాఠం చెబుతారని రాహుల్ హెచ్చరించడం విశేషం. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రజావ్యతిరేక చర్యలతో ప్రధాన సమస్యలు పక్కకు పోయేలా చేస్తున్నారని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా కూడా అలాంటిదేనని దేశంలో ప్రతి వస్తువు చైనాదే అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తారన్నారని అది ఎక్కడ ఉందని ప్రశ్నలు వేశారు.

మన్మోహన్ చురకలంటించారు ...

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ ఎఐసిసి లో చెలరేగారు. బిజెపి వస్తే దేశంలో రెండుకోట్ల ఉద్యాగాలన్నారని, కానీ రెండులక్ష ఉద్యోగాలు కూడా కల్పించలేక పోయారని ధ్వజమెత్తారు. ఇక నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో ప్రజలు విలవిల్లాడారని విమర్శించారు. మాజీ క్రికెటర్ సిద్ధూ 2019 లో ఎర్రకోటపై రాహుల్ భాయ్ జెండా ఎగురవేస్తారని జోస్యం చెప్పారు. అలా మోడీ సర్కార్ పై కాంగ్రెస్ తమ సదస్సులో ముప్పేటదాడి చేయడం చర్చనీయాంశం.

Similar News