కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టకముందే రాహుల్ గాంధీ పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఒకరకంగా సీనియర్ నేతలకు ఇది హెచ్చరికగానే చెప్పొచ్చు. ప్రధాని నరేంద్ర మోడీపై మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీని అయ్యర్ ‘నీచ్’ అని సంభోదించడంపై విమర్శలువెల్లువెత్తాయి. దీంతో వెంటనే అయ్యర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వం కూడా తొలగించారు. గత కొన్నేళ్ల చరిత్ర చూస్తే సీనియర్ నేతలపై ఇలాంటి చర్యలకు దిగడం కాంగ్రెస్ పార్టీకి ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. పార్టీ వీడి వెళ్లిన నేతలను సస్పెండ్ చేయడం తప్ప వివాదాస్పద వ్యాఖ్యలను చేసిన వారిని మాత్రం చూసీ చూడనట్లు వదిలేసింది.
అయ్యర్ సస్పెన్షన్ పై మిశ్రమ స్పందన....
అయితే మణిశంకర్ అయ్యర్ విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే ఒకవైపు గుజరాత్ ఎన్నికలు శనివారం జరగనున్న నేపథ్యంలో అయ్యర్ వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేవిగా ఉన్నాయనిచెప్పక తప్పదు. అసలే గుజరాత్ ప్రజలు మోడీని సొంత మనిషిగా చూస్తున్నారు. అయితే ప్రధానిగా మోడీ వెళ్లిన తర్వాత గుజరాత్ లో కాంగ్రెస్ కొంత పుంజుకోవడం ప్రారంభించింది. సర్వేల్లో కూడా కొంత అనుకూలత లభిస్తుంది. ఈ దశలో అయ్యర్ వ్యాఖ్యలు పార్టీకి భారీగా నష్టాన్ని చేకూరుస్తాయని భావించిన రాహుల్ వెంటనే చర్యలకు దిగి సస్పెన్షన్ వేటు వేశారు. అయితే రాహుల్ చర్యపై ప్రశంసలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయ్యర్ సస్పెన్షన్ పై రాహుల్ ను అభినందిస్తూ అనేకమంది పోస్ట్ లు పెట్టడం విశేషం. వెల్ డన్ రాహుల్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. రాహుల్ ఇంకా పగ్గాలు చేపట్టకముందే అయ్యర్ పై చర్య తీసుకోవడంపై కొందరు సీనియర్ నేతలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత సస్పెండ్ చేస్తే బాగుండేదని కొందరు సూచిస్తున్నారు. మొత్తం మీద రాహుల్ అయ్యర్ పై చర్యతో పార్టీలో మరింత పట్టు సాధించేందుకు సిద్ధమయ్యారు.