ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకను వదిలేట్లు లేరు. ఆయన కర్ణాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కర్ణాటకలో రాహుల్ పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిందనే చెప్పాలి. రాజకీయాలను కూడా హీటెక్కించింది. తన నానమ్మకు ఆసరాగా నిలిచిన ప్రాంతంలో పర్యటించి ఆయన గత సంగతులను గుర్తుకు తెచ్చుకున్నారు. అంతేకాదు గుజరాత్ ఎన్నికల మాదిరిగానే పీఠాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులను ఆయన సందర్శిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో కన్నడ కోటపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది.
రెండు జిల్లాల్లో పర్యటన.....
రాహుల్ పర్యట మొత్తం చిక్కమగళూరు, హసన్ జిల్లాల్లో సాగింది. రాహుల్ పర్యటనకు పెద్దయెత్తున కార్యకర్తలతోపాటు ప్రజలూ హాజరవ్వడం ఆ పార్టీ నేతల్లో సంతోషాన్ని నింపింది. అధికార పార్టీగా ఉండటంతో సహజంగా ఉండే వ్యతిరేకతను తొలగించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. అందుకు జాతీయ రాజకీయాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోడీపైనే ఆయన విమర్శలు ఎక్కువగా చేస్తున్నారు. అందరూ మిలాఖత్ అయి కాంగ్రెస్ నుఓడించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
దేవెగౌడ ను సయితం.....
రాహుల్ గాంధీ మాజీ ప్రధాని దేవెగౌడ ను కూడా వదలిపెట్టలేదు. హాసన్ జిల్లా దేవగౌడ పార్టీకి కంచుకోట. అక్కడ ఆయనపైన రాహుల్ నిప్పులు చెరిగారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ దొడ్డిదారిన గెలిచేందుకు దేవెగౌడ పార్టీ సాయం తీసుకుంటుందన్నారు. బీజేపీ బీ పార్టీగా దేవగౌడ పార్టీని రాహుల్ అభివర్ణించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు కౌరవ, పాండవుల మధ్య జరిగిన యుద్ధంగా రాహుల్ తెలిపారు.
సంప్రదాయ దుస్తుల్లో.....
రాహుల్ తన పర్యటనలలో శృంగేరీ పీఠాన్ని దర్శించారు. శృంగేరీ శారదా పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులను ఆయన పొందారు. పంచె, ధోవతిని కట్టి ఆయన సంప్రదాయ బద్ధంగా శారదాంబ ఆలయంలోకి వచ్చారు. రాహుల్ పర్యటనతో కర్ణాటక కాంగ్రెస్ లో నూతనోత్తేజం కలిగించింది. పార్టీ నేతలు రాహుల్ పర్యటనతో గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నారు. కర్ణాటక ఎన్నికలు ఈ ఏడాది జరగనుండటంతో అప్పుడే ఎన్నికల వేడి మొదలయింది. ఇటు బీజీపీ అగ్రనేతలు కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.