గుజరాత్ ను ఎలాగైనా కైవసం చేసుకుని ప్రధాని మోడీని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ యువనేత రాహుల్ భావిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాతనైనా తమకు విజయం దక్కకపోతుందా? అన్న ఆశతో రాహుల్ టీం ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగానే అసంతృప్తి నెలకొని ఉంటుంది. ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు రాహుల్ గాంధీ గుజరాత్ ను వదిలిపెట్టకుండా పర్యటిస్తున్నారు. దక్షిణ గుజరాత్ లో పర్యటించిన రాహుల్ ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. మోడీ వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు సభలు, సమావేశాలు, ప్రచారం చేస్తూనే మరొక వైపు వివిధ సామాజిక వర్గాల నేతలను కాంగ్రెస్ వైపుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందరినీ కలుపుకుని పోయేలా రాహుల్ పర్యటన సాగుతోంది. ముఖ్యంగా యువత రాహుల్ వెంట పరుగులు తీస్తోంది. యాడ్ క్యాంపెయిన్ లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలపై కాంగ్రెస్ రూపొందించిన యాడ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అన్ని సామాజిక వర్గనేతలతో....
ఇటీవల గుజరాత్ లో పటేళ్ల రిజర్వేషన్ పోరాటనేత హార్థిక్ పటేల్ తో చర్చలు జరిపిన రాహుల్ ఆ తర్వాత ఠాకూర్ వర్గం నేతలతోనూ చర్చించారు. హార్థిక్ పటేల్ కూడా కాంగ్రెస్ కు మద్దతు పలికారు. దీంతో రాహుల్ లో జోష్ పెరిగింది. తాజాగా దక్షిణ గుజరాత్ లో పర్యటించిన రాహుల్ గాంధీ దళిత యువనేత జిగ్నేష్ మేవానితో కూడా చర్చలు జరిపారు. జిగ్నేష్ కొన్ని డిమాండ్లను రాహుల్ ముందుంచారు. దళిత కుటుంబాలకు ఐదెకరాల భూమి, చర్మకార కుటుంబాలకు పునరావాసం, దళిత యువకులకు ఉపాధి అవకాశాలపై జిగ్నేష్ రాహుల్ తో చర్చించారు. జిగ్నేష్ డిమాండ్లకు రాహుల్ సానుకూలంగా స్పందించారు. దీంతో గుజరాత్ లోని ప్రధాన సామాజికవర్గాలనేతలందరితో నూ రాహుల్ మాట్లాడి వారిని తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డిమాండ్లన్నింటినీ కాంగ్రెస్ మ్యానిఫేస్టోలో పెట్టేందుకు రాహుల్ అంగీకరించారు.