రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలన చేపట్టిన తర్వాత వరుసగా శుభవార్తలు మీద శుభవార్తలు అందుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ పరిస్థితే మారిపోయింది. పార్టీలో అప్పటి వరకూ ఆయన సమర్థతపై లోలోపల అనుమానం వ్యక్తం చేసిన సీనియర్లు సయితం వారేవా... రాహుల్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక గుజరాత్ ఎన్నికల ఫలితాలు రాహుల్లోనూ ఆత్మస్థయిర్యాన్ని పెంచాయనే చెప్పాలి. అతి తక్కువ సీట్ల తేడాతో ఓటమి పాలు కావడం, మోడీకి,అమిత్ షాకు వారి సొంత కోటలోనే చుక్కలు చూపించగలగడం ఒకరకంగా రాహుల్ పైచేయి సాధించాడనే చెప్పాలి. ఇది అంతర్గత సమావేశాల్లో బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తున్న విషయమే.
2జీ స్కామ్ తేలిపోయింది....
ఇక యూపీఏ సర్కార్ 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడానికి ప్రధాన కారణం అవినీతి కేసులే. అందులో ప్రధానంగా 2జీ స్పెక్ట్రమ్ కేసు. ఈ కేసు కారణంగానే అన్నా హజారా లాంటి వారు బయటకు వచ్చి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. బీజేపీ దాన్ని క్యాష్ చేసుకోగలిగింది. కాని 2జీ కేసు ఇప్పుడు తేలిపోయింది. కోర్టు ఈ కేసులో ఉన్నవారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. డీఎంకే సంగతి ఎలా ఉన్నా..కాంగ్రెస్ కు మాత్రం ఇదినిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే తమ సర్కార్ ను అప్రదిష్ట పాలు చేసిన ఈ కేసుపై బీజేపీ నేతలు చేసిన నిందారోపణలను ఇప్పుడు తిప్పికొట్టగలిగే అవకాశం దక్కింది. బీజేపీ, మీడియా కలిసి అవినీతి లేకున్నా భూతద్దంలో చూపారని రేపటి నుంచి కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లనుంది.
ఆదర్శ్ కుంభకోణమూ అంతేనా?
దీంతో పాటు ఆదర్శ్ స్కాంలో కూడా ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఊరట లభించింది. ఆయనను ప్రాసిక్యూట్ చేయాలన్న ఉత్తర్వులను ముంబయి హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. కేసు దర్యాప్తులో సీబీఐ సరైన సాక్ష్యాలు చూపించకపోవడం వల్లనే ఆయనను తిరిగి విచారించాలని గవర్నర్ ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. మాజీ ముఖ్యమంత్రులను విచారించాలంటే అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది. కాని అంతా చర్చించాకే గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసినా కోర్టు మాత్రం చవాన్ ను విచారించడానికి అనుమతించలేదు. ఇలా ఏ స్కామ్ ల ఆరోపణల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసకబారిందో వాటినుంచి ఒక్కొక్కటిగా బయటపడుతుండటం నిజంగా కాంగ్రెస్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొత్తం మీద రాహుల్ అధ్యక్షుడిగా అడుగుపెట్టిన వేళా విశేషమేమో కాని...అన్నీ శుభవార్తలే అందుతున్నాయి.