రాహుల్....ఇక...రా...రా...రా!

Update: 2017-12-11 16:30 GMT

ఏఐసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు యువనేత రాహుల్ గాంధీ సిద్ధమయిపోయారు. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. గుజరాత్ పోలింగ్ పూర్తయి, కౌంటింగ్ కు ముందు రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టునున్నారు. ఈనెల 16వ తేదీకి అందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీన గుజరాత్ రెండోదశ ఎన్నికల పోలింగ్ పూర్తవుతుంది. 18వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. అందుకే మధ్యలో 16న పార్టీ పగ్గాలు చేపట్టాలని రాహుల్ నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి కూడా సంకేతాలు అందాయి. జనవరిలో పార్టీ ప్లీనరీ పెట్టే అవకాశం కూడా ఉంది. అప్పుడే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కూడా నియమించనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ నామినేషన్ ఒక్కరే వేయడంతో ఇక ఆయన ఎన్నిక కేవలం లాంఛనప్రాయమే.

ముహూర్తం నిర్ణయం....

ఈ నెల 16వ తేదీన జరిగే కార్యక్ర్రమంలో రాహుల్ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సమావేశంలో సోనియా అధ్యక్షురాలిగా తన చివరి ప్రసంగాన్ని చేయనున్నారు. దాదాపు 19 ఏళ్ల పాటు పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీ ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో ఆమె అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టే కార్యక్రమానికి సీనియర్ నేతలనే ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ వేడుక జరగనుందని సీనియర్ నేతలు చెప్పారు. అయితే చిన్న వయసులోనే రాహుల్ ఈ బాధ్యతలను తీసుకుంటున్నారు. అదీ క్లిష్ట సమయంలో. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగులుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ పదవి చేపడుతున్నారు. దేశం మొత్తంలో కేవలం కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా పవర్ లో ఉంది. ఇప్పుడు అంతా బీజేపీ, ప్రాంతీయ పార్టీల మయం అయిన పరిస్థితుల్లో రాహుల్ పగ్గాలు చేపట్టి పార్టీకి పునరుజ్జీవం తెస్తారని పార్టీశ్రేణులు గంపెడాశతో ఉన్నాయి. మరి రాహుల్ పార్టీకి జవసత్వాలు తెస్తారా? లేదా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

Similar News