తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు నియోజకవర్గమైన ప్రత్తిపాడులో వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్పపాదయాత్ర కొనసాగుతోంది. ప్రత్తిపాడు నియోజకవర్గం అన్ని పార్టీలకూ ఇది అవకాశం ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం రిజర్వడ్ నియోజకవర్గంగా ఉంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైసీపీ గెలిచింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరిత ఇక్కడ గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి వైసీపీ గుర్తుమీద 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సుచరితపైన టీడీపీ అభ్యర్థి రావెల కిశోర్ బాబు ఏడు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
టీడీపీలో గ్రూపుల గోల....
అయితే కొన్నాళ్లుగా ఇక్కడ టీడీపీలో గ్రూపులు మొదలయ్యాయి. రావెలను ఒంటరిని చేసేశారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కడం కూడా కష్టమే. రావెల కూడా టీడీపీపై ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూ వస్తున్నారు. రావెల వైసీపీ కార్యకర్తలకే ఎక్కువ పనులు చేసి పెడుతున్నారని, టీడీపీ క్యాడర్ ను పట్టించుకోవడం లేదని చాలా రోజుల నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు అధిష్టానానికి, జిల్లా మంత్రులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలో రావెల పార్టీ మారతారన్న టాక్ కూడా బలంగా విన్పిస్తోంది. ఆయన కూడా తాను ఇక టీడీపీలో ఇమడలేననే నిర్ణయానికి వచ్చారు. పార్టీ మారడం ఖాయం...కాని ఏ పార్టీ అనేది కాలమే తేలుస్తుందని రావెల తన సన్నిహితులతో వ్యాఖ్యానించారు.
ఖచ్చితంగా గెలుస్తాం....
అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచి ఇప్పుడుపార్టీలోకి వస్తామన్నా జగన్ రావెల రాకను అంగీకరించరన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయినా, అది అప్పుడు పరిస్థితులు టీడీపీకి కలిసివచ్చాయన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ప్రస్తుతం ప్రత్తిపాడులో అధికార పార్టీపై అసంతృప్తి తీవ్రంగా ఉందంటున్నారు. ఈ అసంతృప్తే తమ అభ్యర్థిని గెలిపిస్తుందని వైసీపీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు. జగన్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో వచ్చే ఎన్నికల్లో తమదే ఇక్కడ విజయమన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు. కాకుమానులో జరిగిన రైతుసదస్సులో జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.