క్రమంగా మబ్బులు విడిపోతున్నాయి. ముందుముందు పాకిస్తాన్ పట్ల భారత్ వ్యవహరించబోతున్న తీరు ఏమిటో సాక్షాత్తూ ప్రధాని స్పష్టత ఇస్తున్నారు. ‘‘ఉగ్రదాడులు జరుగుతున్నప్పుడు యుద్ధాలు తప్పవు’’ అంటూ మోదీ నోటమ్మట వచ్చిన మాటలు చాలా తీవ్రమైనవని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా అంతర్జాతీయంగా తీవ్రమైన ప్రభావం చూపించే మాటలు అని పలువురు భావిస్తున్నారు. అయితే దుష్టశక్తికి ప్రతీకగా దసరా ఉత్సవాల్లో ఎంతో ఘనంగా నిర్వహించే ‘రావణ దహనం’ కార్యక్రమంలో పాల్గంటూ, పాకిస్తాన్ ను ఉద్దేశించి మోదీ ఈ హెచ్చరిక చేయడం అనేది యాదృచ్ఛికం కాకపోవచ్చు.
ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. లక్నోకు వచ్చిన ప్రధానిని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ విమానాశ్రయానికి వచ్చి మరీ స్వాగతించి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ‘జై శ్రీరాం’ నినాదంతో తన ప్రసంగం ప్రారంభించిన మోదీ.. ఉగ్రదాడులు జరుగుతున్నప్పుడు యుద్ధాలు తప్పవంటూ పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరించారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను ప్రపంచ దేశాలన్నీ కలిసి వెలివేయాలని కూడా పాక్ పట్ల తమ అంతర్జాతీయ విధానాన్ని మరోమారు ప్రస్తావించారు.
ఈ సభలో నరేంద్రమోదీ ఉగ్రవాదాన్ని రావణుడితో పోలుస్తూ మాట్లాడడం విశేషం. రావణుడే ఉగ్రవాదం అనే అర్థం వచ్చేలా మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో ఉగ్రవాదం పై పోరాడిన మొదటి వ్యక్తి జటాయువు అని.. ఒక మహిళ (సీతాదేవి) మాన ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలను త్యాగి చేశాడని మోదీ ఉదాహరించారు. సమాజానికి చేటు చేసే వాళ్లంతా రావణులేనని, వారినంతా అంతమొందించాల్సిందేనని, సమాజంలో ప్రతి పౌరుడూ జటాయువులో బాద్యతతో ప్రవర్తించాల్సి ఉందన మోదీ పిలుపు ఇచ్చారు.
మోదీ మాటలు భవిష్యత్ యుద్ధ పరిణామాలకు తుది సంకేతాలా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.