పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్ నిర్మాణం దక్కించుకున్న ఎంపీ రాయపాటి సాంబశివరావు పై నిన్న మొన్నటి దాకా కస్సు బుస్సులాడిన ఏపీ సీఎం చంద్రబాబు మెత్తబడ్డారు. ట్రాన్స్ స్ట్రాయి కంపెనీని మార్చే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పై అధికారులతో జరిపిన సమీక్షలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీ కి సైతం ఇదే విషయాన్నీ స్పష్టం చేసినట్లు సీఎం వ్యాఖ్యానించారు. బాబు మెత్తబడటం వెనుక కారణాలు ఏమిటన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రభుత్వమే కారణమన్న ట్రాన్స్ స్ట్రాయి ...
పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడం వెనుక తమ తప్పేమి లేదని ట్రాన్స్ స్ట్రాయి ఆధారాలతో సహా ఢిల్లీ లో పంచాయితీ పెట్టింది. తన అల్లుడు నిర్వహించే ఈ కంపెనీ వెనుక చక్రం తిప్పే ఎంపీ రాయపాటి సాంబశివరావు ఢిల్లీ లో అన్ని పార్టీలతో మంచి సంబంధాలు కలిగివున్నారు. దాంతో ఆయన నేరుగా గడ్కరీ ని కలిసి భూమి అప్పగింత, నిధుల విడుదలలో జాప్యాలు ఆధారాలతో ముందు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ లోపాలను పెద్ద ఎత్తునే ఎత్తి చూపారు. కాంట్రాక్ట్ వేరొకరికి ఇస్తే 35 శాతం అదనంగా ఖర్చు అవుతుందన్న అంశాన్ని వివరించారు. దాంతో కేంద్రం పాత కాంట్రాక్టర్ ను మార్చడానికి వీలు లేదని రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకి అడ్డు కట్ట వేసింది. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చేసేది లేక ట్రాన్స్ స్ట్రాయి తోనే పనులు చేయించుకోవాలని బాబు నిర్ణయించారు.
ఈ నెల 23 నుంచి లోయర్ కాఫర్ డ్యామ్ పనులు ...
పోలవరం ప్రాజెక్ట్ లోయర్ కాఫర్ డ్యామ్ పనులు ఈనెల 23 నుంచి చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులతో జరిపిన సమీక్షలో సీఎం ఈ వివరాలు వెల్లడించారు. శరవేగంగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇటీవల నిధుల విడుదలకు సంబంధించి కేంద్రంతో ఏర్పడ్డ సందిగ్ధతను బాబు ప్రస్తావించకపోవడం విశేషం.