అయోధ్యకు వెళ్లే భక్తులు కేవలం రామజన్మభూమిని సందర్శించి రావడం మాత్రమే కాదు. రామాయణం కథను కూడా సాంతం తెలుసుకోగలుగుతారు. రాముడి జీవిత విశేషాలతో నభూతో నభవిష్యతి అనదగిన రీతిలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఓ అద్భుతమైన మ్యూజియం నిర్మించడానికి మోదీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలోని ఇలాంటి అరుదైన మ్యూజియంగా ఇది నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రాముడి విశేషాలు, రామాయణం కథాను కొత్త రూపంలో తెలుసుకోగోరే ఔత్సాహికులంతా సందర్శించే పర్యటక ప్రాంతంగా అయోధ్యను అభివృద్ధి చేయడం జరుగుతుంది.
ప్రస్తుతం అయోధ్యలో రామజన్మభూమి ఉన్న ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో 25 ఎకరాల స్థలంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యటక శాఖ మంత్రి మహేశ్ శర్మ ఆ ప్రాంతంలో ఇవాళ పర్యటించబోతున్నారు. ఇక్కడ అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న మ్యూజియంకు నేపాల్‌లోను, శ్రీలంకలోను రామాయణ అనుబంధ ప్రదేశాలతో అనుసంధానం చేయగల ఏర్పాట్ల గురించి కూడా మంత్రి పరిశీలిస్తారు.
అయితే రామజన్మభూమి ఉన్న ప్రదేశంలో రామమందిర నిర్మాణాన్ని ప్రస్తుత భాజపా సర్కారు చేపడుతుందా? లేదా? అనేది కూడా ఒక కీలకాంశంగానే ఉంది. ఒకవైపు భాజపా నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ రామమందిర నిర్మాణం జరిగితీరుతుందని అంటూ వస్తున్న నేపథ్యంలో.. సరిగ్గా యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండగా.. అయోధ్యలో ఈ రాముడి మ్యూజియం నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధం కావడం స్పష్టమైన సంకేతాలనే ఇస్తున్నదని పలువురు అనుకుంటున్నారు.
అయితే మోదీ సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం రాముడి మ్యూజియంను ప్రకటించినంత మాత్రాన హిందువులందరి ఓట్లను రాబట్టడం సాధ్యం అవుతుందా? అదే సమయంలో యూపీలో ఎంతో కీలకం అయిన ముస్లిం వర్గం ఓట్లను దూరం పూర్తిగా చేసుకోవడమే అవుతుందని బీజేపీ గుర్తించకుండా ఉంటుందా అనేది మరో వాదన. మ్యూజియం ఏర్పాటు విషయంలో.. అది ఎక్కడ భాజపాకు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కలిగించేస్తుందో అని విపక్షాలు ఆందోళన చెందడం తప్ప.. మరో రకమైన విమర్శలు లేవు. కాకపోతే.. ఇలాంటి రాముడి మ్యూజియం పూర్తయిందంటే మాత్రం.. ఇప్పటికే రాముడి జీవితాన్ని , వ్యక్తిత్వ గుణ విశేషాల్ని పాఠాలులాగా , తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలుగా పరిగణిస్తున్న అనేక ప్రపంచ దేశాల వారికి ఈ మ్యూజియం ఓ యాత్రాస్థలం అవుతుందనడంలో సందేహం లేదు.