రాజ్యసభ ఎన్నికల కోసమేనా...?

Update: 2018-03-16 03:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరు శాసనసభ్యత్వాలను రద్దు చేసే అధికారం లేకపోయినా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దీనిపై తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కాంగ్రెస్ సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, వి.హనుమంతరావు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ ను కలిశారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన.....

అలాగే శాసనసభ్యత్వం రద్దయిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ సభ్యత్వాలను రద్దు చేయడమే కాకుండా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను ఖాళీగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని వారు తప్పుపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను సస్పెండ్ చేయాలని వారు న్యాయస్థానాన్ని తమ పిటిషన్ లో కోరారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే తమ శాసనసభ్యత్వాలను రద్దు చేశారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. దీనిపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.

ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే.....

కాగా కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేతలు తమ మూకుమ్మడి రాజీనామాలపై అధిష్టానంతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నియంతలా మారి విపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ సభలో ఉండటం కంటే రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళ్లి తేల్చుకోవడమే మంచిదని హైకమాండ్ కు నేతలు నచ్చ జెప్పనున్నారు. హైకమాండ్ ఆదేశిస్తే ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే మూకుమ్మడి రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. మొత్తం మీద కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

Similar News