రాజీనామాల తర్వాత బీజేపీ జోరు

Update: 2018-03-08 11:30 GMT

రాజీనామాలు చేసిన తర్వాత ఏపీ బీజేపీ నేతలు వేంగం పెంచారు. కేంద్ర పథకాలు, ప్రాజెక్టులను పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పరశీలనకు వెళ్లారు. బీజేపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావుతో పాటుబీజేపీ నేతలు గుంటూరులోని మంగళగిరి నిర్మిస్తున్న ఎయిమ్స్ పరిశీలనకు వెళ్లారు. కేంద్రం నిధులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారన్నదానిపై పరిశీలన జరిపేందుకు వెళ్లారు. కేంద్రం నిధులు ఇస్తున్నా ఇవ్వడం లేదని, ఎయిమ్స్ కు ప్రహరీ గోడ నిర్మించలేదని చెబుతున్న టీడీపీ నేతల ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకే ఈ పర్యటనకు వెళ్లారు.

క్షేత్రస్థాయి పర్యటనకు.....

రాజీనామాలు చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ పర్యటనలుచేయడం విశేషం. బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వం ఆదేశం మేరకే ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. కేంద్రం అనేక సంస్థలను ప్రకటించిందని, నిధులు కూడా విడుదల చేసిందని, అయితే పైసా కూడా లెక్క చెప్పకుండా పనులు చేపట్టకుండా ఉండటాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. కేంద్రం ఏపీని ప్రత్యేకంగా చూస్తూ ఇతోధికంగా సాయం అందిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ రాజకీయ కారణాలతో కేంద్రమంత్రివర్గం నుంచి వైదొలగడంపై ఆ పార్టీని ఎండగట్టాలని నిర్ణయించింది.

నిధులు ఇచ్చినా.....

ఒక్క ఎయిమ్స్ మాత్రమే కాదు...పోలవరం అన్ని ప్రాజెక్టులను పరిశీలించి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ను అధిష్టానానికి అందిస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి పదిహేను వందల కోట్ల రూపాయల నిధులు ఇస్తే తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయాన్ని నిర్మించడాన్ని కూడా బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ఛత్తీస్ ఘడ్, జార్ఘండ్ రాష్ట్రాలు రాజధాని నిర్మాణాలు చేసుకోలేదా? ఆ రాష్ట్రాలకు లేని ప్రత్యేకత ఏపీకి ఎందుకని కేంద్ర నాయకత్వం ప్రశ్నిస్తోంది. టీడీపీ వెళ్లిపోయినా పరవాలేదు కాని తమపై బురద జల్లి వెళుతున్నందున వాస్తవ పరిస్థితులను తెలియజెప్పడానికి వాస్తవ పరిస్థితులను సేకరించాలని బీజేపీ రాష్ట్ర నేతలను ఆదేశించింది.

ప్రజలకు వాస్తవాలను....

టీడీపీ, బీజేపీ తెగదెంపులు ఖాయమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కేంద్రమంత్రి వర్గం నుంచి తప్పుకున్న టీడీపీ త్వరలోనే ఎన్డీఏ నుంచి తప్పుకుంటుందన్నది వారికి తెలియంది కాదు. వారిని బతిమాలే కంటే కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేసింది? ఎంత నిధులను కేటాయించింది? వాటిని ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది? తదితర విషయాలను ప్రజల ముందు ఉంచేందుకు బీజేపీ సిద్ధం చేసింది. వివిధ సంస్థలకు నిధులిచ్చినా వేరే కార్యక్రమాలకు నిధులను మళ్లించారన్నది బీజేపీ ప్రధాన ఆరో్పణ.

Similar News