ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అమరావతి తుది డిజైన్ల కు మెరుగులు దిద్దడానికి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈనెల 12 నుంచి మూడు రోజులపాటు లండన్ వెళ్ళి అమరావతి డిజైన్లు తయారు చేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత సంస్థ నార్మన్ పోస్టర్ టీం తో ఆయన భేటీ కానున్నారు. రాజమౌళి తో పాటు మంత్రి నారాయణ , సీఆర్డీఏ అధికారులు లండన్ లో వుంటారు. రాజధాని తుదిరూపుకి మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి కోరిక మేరకు రాజమౌళి అంగీకరించిన విషయం తెలిసిందే . దీనిపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగినా జక్కన్న తనదైన రీతిలో తిప్పికొట్టి అమరావతి చరిత్రలో తన పాత్ర వుండాలని భావించారు . దాంతో ఆయన ప్రభుత్వ అభ్యర్ధనను మన్నించి పనిలో దిగారు.
నార్మన్ పోస్టర్స్ తో టచ్ లో వున్న జక్కన్న ...
రాజమౌళి తెలుగుదనం ఉట్టి పడేలా సూచనలు చేస్తారని నమ్మి ఆయనకు బాధ్యతలు అప్పగించిన ఏపీ సీఎం ఆశలకు అనుగుణంగా నడుస్తున్నారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా నార్మన్ పోస్టర్స్ తో ఆయన ఎప్పటికప్పుడు టచ్ లో వుంటూ అమరావతి ని చెక్కే పనిలో బిజీ అయ్యారు. ఇప్పుడు నేరుగా లండన్ లో దగ్గరుండి మెరుగులు దిద్దుతారు. ఈ బృందం వచ్చేసిన వెంటనే పదిరోజుల్లో చంద్రబాబు బృందం లండన్ చేరుకొని వారు చేసిన పని పరిశీలించి ఆమోదముద్ర వేస్తుంది. తుది రూపు ఖరారు అయ్యాక భారీ బ్లూ ప్రింట్ జనం లో పెట్టి శంకుస్థాపన మరోసారి అట్టహాసంగా చేయడానికి చంద్రబాబు సర్కార్ సన్నాహాలు చేస్తుంది .