రాజధానికి కూతవేటులో జగన్?

Update: 2018-03-31 01:30 GMT

రాజధానిలోకి జగన ప్రజాసంకల్ప యాత్ర ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న తాడికొండ నియోజకవర్గంలోకి జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేరుకుంది. తాడికొండ నియోజకవర్గం రిజర్వడ్ నియోజకవర్గం. కాంగ్రెసె, టీడీపీ, కమ్యునిస్టుల పార్టీలను కూడా ఈ నియోజకవర్గం గతంలో ఆదరించింది. తాడికొండ నియోజకవర్గం ఒకసారి ఒక పార్టీని ఆదరిస్తే మరోసారి ఇంకొక పార్టీని చేరదీస్తుంది. 2004, 2009లో మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంలో మాత్రం రెండుసార్లు వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించింది.

అన్ని పార్టీలకూ....

1967లో తాడికొండ నియోజకవర్గం ఏర్పడింది. 1967, 1972, 1978లో వరుసగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. తర్వాత 1983లో స్వతంత్ర అభ్యర్థిగా జేఆర్ పుష్పరాజ్ గెలుపొందారు. తర్వాత 1985లో టీడీపీ నుంచి పోటీ చేసిన పుష్పరాజ్ తిరిగి గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. 1994లో సీపీఐ అభ్యర్థి జీఎంఎన్.వి. ప్రసాద్ ఇక్కడ విజయం సాధించారు. 2004, 2009లో వరుసగా ఇక్కడ కాంగ్రెస్ తరుపున డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి హెనీ క్రిస్టినాపై టీడీపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ ఏడు వేల ఓట్ల పై చిలుకు తేడాతో విజయం సాధించారు.

అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు....

రాజధానికి భూములు ఇచ్చిన గ్రామాలు ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో జగన్ పాదయాత్రకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికీ రాజధాని శాశ్వత నిర్మాణాలు ప్రారంభం కాకపోవడం, భూములిచ్చిన రైతులు అసంతృప్తితో ఉండటాన్ని జగన్ క్యాష్ చేసుకుంటున్నారు. రాజధానికి పక్కనే ఉన్న నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవాలన్ని వైసీపీ వ్యూహంగా ఉంది. మేడికొండ, సిరిపురం, సరిపుడి లో పర్యటించిన జగన్ కు భారీ స్వాగతం లభించింది. ప్రజలు పెద్దయెత్తున తరలి రావడంతో వైసీపీ నేతల్లో ఉత్సాహం నెలకొంది.

125వ రోజుకు చేరుకున్న పాదయాత్ర....

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 125వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం జగన్ సిరిపుడి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి వెలవర్తిపాడు, మేడికొండూరు మీదుగా గుండ్లపాలెం క్రాస్ రోడ్స్ కే పాదయాత్ర చేరుకోనుంది. అక్కడ భోజన విరామానికి జగన్ ఆగుతారు. అక్కడి నుంచి జగన్ పాదయాత్ర పేరిచెర్లకు చేరుకుంటుంది. పేరిచెర్లలో వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. పేరిచెర్లలోనే జగన్ రాత్రి బస చేస్తారు. గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్రకు విశేష స్పందన వస్తుండటంతో పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది.

Similar News