రజనీపై మైండ్ గేమ్ ఆడుతున్నారా?

Update: 2018-01-19 17:30 GMT

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై స్థానిక నేతలతో పాటు సినీ ప్రముఖులు కూడా విరుచుకుపడుతున్నారు. ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందని వాడన్న అంశాన్ని నేరుగా ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. జయలలిత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి నాన్ లోకల్ నినాదం రాలేదు. కాని ఇప్పుడు రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించగానే ఆయన వ్యతిరేకులు తమిళనాడులో రోజురోజుకు పెరిగిపోతున్నారు. రజనీకి తమిళనాడు అంతటా లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. దాన్ని ఎవరూ కాదనలేరు.

రజనీపై మాటల దాడి....

రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రకటించకముందే శరత్ కుమార్ లాంటి నటులు కూడా వ్యతిరేకించారు. రజనీ కన్నడ రాష్ట్రానికి చెందిన వారని నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దీంతో శరత్ కుమార్ పై రజనీ అభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఇవన్నీ రజనీకాంత్ పెద్దగా పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోయారు. అయితే ఇటీవలే తన అభిమానుల సమక్షంలో రజనీకాంత్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. దీంతో తమిళనాడు అంతటా ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. పార్టీని పెడతానని చెప్పిన తర్వాత రజనీ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కూడా కలిసి ఆశీస్సులు పొందారు.

పార్టీ ప్రకటిస్తానని చెప్పగానే...

అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని రజనీ చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న స్పష్టత రజనీనుంచి వచ్చింది. ఈలోగా జిల్లాల వారీగా పార్టీని పటిష్టపర్చేందుకు రజనీ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే సభ్యత్వ నమోదును కూడా ప్రారంభించారు. ఈకార్యక్రమానికి అనూహ్య స్పందనే లభిస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకే నేతలు కూడా కొందరు రజనీ పార్టీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రజనీ పార్టీలో చేరడానికి ఇప్పటికే అంతా సిద్ధం చేసుకున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.

నిప్పులు చెరిగిన భారతీ రాజా....

అయితే ఈ నేపథ్యంలో రజనీ పార్టీని ప్రకటించకముందే తమిళనాడులో మైండ్ గేమ్ స్టార్ట్ అయింది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా రజనీకాంత్ పై నిప్పులు చెరిగారు. రజనీకాంత్ నాన్ లోకల్ అని భారతీరాజా చెప్పారు. విశ్వాస ఘాతుకానికి నిలువెత్తు నిదర్శనం రజనీకాంత్ అని భారతీ రాజా ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. తమిళులు కాని వారు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని, దీన్ని తాము అంగీకరించబోమని చెప్పారు. వయసు మళ్లిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అలాగే బీజేపీ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో నోటాతో పోటీ పడలేని బీజేపీ రజనీతో ఇక్కడ డ్రామా నడుపుతుందని వ్యాఖ్యనించారు.

నాన్ లోకల్ అంటూ...

రజనీ రాజకీయ పార్టీని పెడుతున్నట్లు ప్రకటించగానే ‘‘నాన్ లోకల్’’ విషయాన్ని ప్రముఖులే లేవనెత్తుతుండటం విశేషం. అయితే ఇది మైండ్ గేమ్ లో భాగంగానే జరుగుతుందన్నది వాస్తవం. రజనీకాంత్ సాధు స్వభావి. ఎలాంటి వివాదాల జోలికి ఆయన వెళ్లరు. సినిమాల్లోనూ, సమాజంలోనూ ఆయన తీరు అలాగే ఉంటుంది. వయస్సులో ఉన్నప్పుడే ఆయన మానసిక ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లి అక్కడ గడిపి వచ్చారు. ఇటీవల సర్వే నివేదికలు కూడా రజనీకాంత్ కు నెగిటివ్ గా వచ్చాయి. ఇప్పుడు తమిళ ప్రముఖుల నుంచి వస్తున్న ఈ విమర్శలను చూసి రజనీకాంత్ వెనక్కు తగ్గుతారా? లేక తాను అనుకున్నట్లు పార్టీ ని ప్రకటిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

Similar News