తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయాల నుంచి తిరిగి వచ్చేశారు. రాగానే ఆయన కొత్త పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. ఇటీవల కొద్దిరోజులుగా తన పై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలోనే జవాబు ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వెనుక నరేంద్ర మోడీ వున్నారని సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు తలైవా. నా వెనుక దేవుడు వున్నాడు. ఆ తరువాత ప్రజలు ఉన్నారంటూ జవాబు ఇచ్చారు రజని.
హిమాలయాల్లోను వెంటాడిన మీడియా ...
ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని హిమాలయాలకు పోతే అక్కడ కూడా రజనీకాంత్ ను మీడియా వెంటాడింది. పలు ప్రశ్నలు సంధించింది. ఇది వేదిక కాదని ఆయన వారిని సున్నితంగా తిరస్కరించారు. తాను ధ్యానం నుంచి తిరిగి వచ్చాక అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని మాటిచ్చారు. అన్నట్లే వచ్చి రాగానే మీడియా తో చిట్ చాట్ చేసి వారి సందేహాలకు తెరదించారు.
ఏప్రిల్ 14 న పార్టీ పెట్టనున్న రజని...
ఏప్రిల్ 14 న రజనీకాంత్ కొత్త పార్టీని ప్రకటిస్తారని సాగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆ రోజు పార్టీని ప్రకటించడం లేదని తేల్చేశారు. ఇక కావేరి జలవివాదం పై ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు రజని. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తెచ్చి కావేరి జలాల వినియోగంపై న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రజనీకాంత్. ఇదిలా ఉండగా రజని కొత్త పార్టీ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. పార్టీ జిల్లాల ఇంచార్జ్ లను పలు చోట్ల నియమించినట్లు చెబుతున్నారు. తలైవా రాకతో ఇప్పుడు ఆ పనులన్నీ చక చకా సాగిపోతున్నాయి.