సూపర్ స్టార్ రజనీకాంత్ బలంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రాష్ట్ర పర్యటన కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాఘవేంద్ర కల్యాణమండపంలో ఆయన ముఖ్యనేతలతో మంతనాలు సాగించారు. త్వరలోనే రాష్ట్ర పర్యటనను ఖరారు చేస్తానని, అందుకోసం రూట్ మ్యాప్ ను తయారు చేయాలని సన్నిహితులకు ఆదేశించారు. రజనీ త్వరలోనే రాష్ట్రంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటన కూడా త్వరలోనే వస్తుందని చెబుతున్నారు.
త్వరలోనే రాష్ట్ర పర్యటన...
రాజకీయ పార్టీ పెడతానన్న రజనీకాంత్ ఇప్పటికే సభ్యత్వ నమోదును ముమ్మరం చేశారు. సభ్యత్వాలను ఆన్ లైన్ లో ఇప్పటికే రజనీ అభిమానులు తీసుకున్నారు. ఇందులో మహిళలు ఎక్కువగా ఉండేలా చూడాలని రజనీ ఆదేశించారు. ఇందుకోసం సభ్యత్వ దరఖాస్తులను ఇళ్లకు తీసుకెళ్లి వారిచేత పూరించాలని రజనీ ఆదేశించారని తెలుస్తోంది. పార్టీ గుర్తు, పేరును కూడా రజనీ త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే రజనీకాంత్ మాత్రం ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పేశారు. దీంతో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే రజనీ పార్టీ రంగంలోకి దిగుతుంది.
కమల్ పార్టీ వస్తుండటంతో....
మరోవైపు తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకసారి ఇంటి నుంచి బయలుదేరి రాష్ట్రం మొత్తం చుట్టి రావాలన్నది ఆయన ఆదేశమని రజనీ సన్నిహితుడు చెప్పారు. త్వరలోనే రజనీ పర్యటన ఉంటుందన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, తమిళ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో అన్ని పార్టీలూ విఫలమయ్యాయని రజనీ ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రక్షాళన జరగకపోతే తమిళనాడు అన్ని రాష్ట్రాల కన్నా వెనకబడి పోతుందని ఆయన పలు సందర్భాల్లో ఆందోళన కూడా వ్యక్తం చేశారు. మరోవైపు కమల్ హాసన్ ఈ నెల 21వ తేదీన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఆయన కూడా పర్యటనకు సిద్ధమవుతున్నారు. అందుకోసం రజనీ రాజకీయంగా వేగం పెంచినట్లు చెబుతున్నారు.