తమిళ ప్రజలు మార్పును కోరుకుంటే తలైవా పంట పండినట్లే. రజనీకాంత్ ఈ పేరుతెలియని వారెవ్వరూ ఉండరు. సినిమాల్లో ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయన కున్న అభిమానం అంతా ఇంతా కాదు. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఏర్పడిన నేపథ్యంలో సరైన సమయంలోనే తలైవా రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే అధినేత కరుణానిధి ఆశీస్సులను కూడా రజనీ పొందారు. తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదన్న రజనీకాంత్ పాలిటిక్స్ లో కి మాత్రం ఎంటర్ అయిపోవడానికి దాదాపు రెడీ అయిపోయారు. ఆయన ఇక సినిమాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టి పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు.
రజనీకి అనుకూలంగా....
ఈ నేపథ్యంలో రజనీ తమిళనాడును చేజిక్కించుకునే అంశాలపై అనేక మంది ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. గత ఐదు దశాబ్దాలుగా తమిళనాడు ప్రజలు రెండు పార్టీలనే ఆదరిస్తున్నారు. అయితే డీఎంకే...కాకుంటే అన్నాడీఎంకే. ఈరెండు పార్టీలు తప్ప వేరే పార్టీకి ప్రత్యామ్నాయం లేదు. ఈ నేపథ్యంలో రజనీ పెట్టబోయే పార్టీకి తమిళనాడులో నెలకొన్న రాజకీయశూన్యత కారణంగా ఖచ్చితంగా విజయావకాశాలు ఉంటాయని జాతీయ పత్రికల నుంచి స్థానిక పత్రికల వరకూ సంపాదకీయాలు రాసేస్తున్నాయి. రజనీకి ప్రజల్లో ఉన్న ఇమేజ్ అంతటిదని విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు.
ప్రత్యామ్నాయం రజీనీయేనా?
అయితే రజనీకాంత్ కు ఇప్పటి వరకూ ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. గతంలో ఆయన డీఎంకేను సమర్థించారు. ఆ తర్వాత తాను తప్పు చేశానని బహిరంగంగానే అంగీకరించారు. ఆయనపై ఇప్పటి వరకూ ఎలాంటి మచ్చలేదు. సినిమాలే ప్రధాన వృత్తిగా భావించే రజనీకాంత్ కు తమిళనాడు అంతటా పుష్కలంగా ఉన్న అభిమానులే ఆయనకు కొండంత బలం. అయితే ఇప్పుడు రజనీ రూపంలో తమిళనాడు ప్రజలకు ప్రత్యామ్నాయం కన్పించిందంటున్నారు. అయితే తమిళ ప్రజలు ఇప్పటి వరకూ ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు బాగా అలవాటుపడిపోయారు. ప్రధానంగా జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమిళనాడు వ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యాయి. అమ్మకాంటీన్లు, అమ్మఫోన్లు, అమ్మకిట్లు, అమ్మ సేవా కేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. జయలలిత ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ఇతర రాష్ట్రాలు కూడా మార్గదర్శకంగా తీసుకున్నాయి.
శూన్యత ఉన్న కారణంగానే....
జయమరణం తర్వాత ఆ పార్టీని నడిపే నమ్మకమైన నేత లేకుండా పోయాడు. డీఎంకేలో కూడా కరుణానిధి మంచానికే పరిమితం కావడంతో అంతా స్టాలిన్ చూసుకుంటున్నారు. డీఎంకేలో కూడా కుటుంబగొడవలు రచ్చకెక్కాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం సరైన సమయంలో చేశారన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. ప్రత్యర్థులు చేసే నాన్ లోకల్ నినాదాన్ని కూడా తమిళ తంబిలు నాన్ సీరియస్ గా తీసుకుంటారన్నది కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఫలితాలను బట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు రజనీ కూడా తమిళనాడులోని అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించడం పొత్తు ఎవరితో లేదని తేల్చి చెప్పేందుకే. తమిళ ప్రజలు ఖచ్చితంగా తలైవర్ ను ఆదరిస్తారన్నది తమిళనాడు మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా విశ్లేషణలు చేస్తోంది.