రజని నాడి పట్టేశారే ...!

Update: 2018-02-17 17:30 GMT

తమిళనాడు కర్ణాటక నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంశం కావేరి జలాలు. ఆ అంశంపై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తాజా తీర్పు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తుంది. 14 టిఎంసిల నీటిని ఇప్పుడు తమిళనాడు సుప్రీం తీర్పు ప్రకారం వదులుకోవాలిసి రావడంపై ఆ రాష్ట్రం భగ్గుమంటుంది. రాజకీయాలకు అతీతంగా కావేరి జలాలపై మరో యుద్ధానికి అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు నడుం బిగిస్తున్నాయి. ఒక పక్క సుప్రీం కోర్ట్ లోనే మారోసారి తమవాదన గట్టిగా వినిపించాలని మేధావివర్గం భావిస్తుంటే పోరాటం ద్వారా తమ హక్కులు సాధించాలని మరికొందరు వాదిస్తున్నారు.

సూపర్ స్టార్ ఇటు వైపే ...

కావేరి జలాల అంశం ఎప్పుడు వివాదాస్పదం అయినా తమిళనాడులో అంతా సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందన కోసమే వేచి చూస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో లక్షలాదిగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన సున్నితమైన ఈ సమస్యపై ఎలా స్పందించినా పెద్ద ఎత్తునే గతంలో ఆందోళనలు చోటు చేసుకునేవి. త్వరలో రాజకీయపార్టీ తో ప్రజల మధ్యకు రాబోతున్న రజనీకాంత్ తమిళ జనం గొంతుకనే వినిపించారు. సుప్రీం తీర్పు పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో బాటు రివ్యూ పిటిషన్ వేసి తాజాగా మరోసారి న్యాయం కోరాలంటూ ప్రభుత్వానికి సూచించారు.

రజని ముందు చూపు ...

ఆయన మిత్రుడు కమల్ హాసన్ తీర్పు సరైనదే అంటూ వ్యాఖ్యానించి ఇప్పుడు తమిళనాట విమర్శల పాలయ్యారు. అదే రజని మాత్రం ప్రజల నాడికి అనుగుణంగా వ్యాఖ్యలు చేసి వారి అభిమానం పొందే ప్రయత్నం చేసి తన రాజకీయ చతురత చాటుకున్నారు. మహారాష్ట్రలో పుట్టి, కర్ణాటకలో పెరిగి, తమిళనాడు వెండితెరపై సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ పై స్థానికేతరుడు అన్న విమర్శలు బలంగానే వున్నాయి. ఈ నేపథ్యంలో రజని పొలిటికల్ అడుగులు ఆచి తూచి వేస్తూ రాబోయే ఎన్నికల్లో తమ కొత్త పార్టీని జనం ఆదరించేలా వ్యూహాత్మకంగా కదలడం విశేషం.

Similar News