తన సహచరుడు మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి ప్రజల్లోకి దూసుకు వెళ్ళినా రజనీకాంత్ తొందరపడలేదు. రాజకీయాలు అంటే బురదగా భావించి ఆ దురద నాకు లేదనేవారు ఆఫ్ ది రికార్డ్ లో. పార్టీ పెట్టి ఖంగుతిన్న చిరంజీవి ఒక సభలో ఆయన ఎదుటే తన వేదన వ్యక్తం చేశారు. నన్ను రాజకీయాల్లోకి తోసి రజనీకాంత్ హాయిగా సినిమాలు చేసుకుంటున్నారని మనసులో మాట చెప్పేశారు. రారేమో అనుకున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేశారు. చిరంజీవి రాజకీయాలనుంచి సినిమాలపై దృష్టి పెట్టారు.
భాషా కు కాటమరాయుడికి పోలిక తెస్తున్న కొందరు ...
ఇప్పుడు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల ముందు పెట్టిన జనసేన పార్టీ ని ఈసారి ఎన్నికల్లో వ్యవస్థాగతంగా బలపరిచే పనిలో పడ్డారు. పవన్ పార్టీ అయితే పెట్టారు కానీ గత ఎన్నికల్లో టిడిపి, బిజెపి లకు ఓట్లు వేయండని సభలు నిర్వహించి సినిమాలు చేసుకుంటూ సాగిపోయారు. ఎన్నికలముందు సమయం లేకపోవడం వల్ల పవన్ పోటీ చేయలేదని ప్రజలు సైతం భావించారు. చాలా సమయం వుంది కాబట్టి 2019 ఎన్నికల్లో పవన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీకి దిగుతారని అభిమానులు తలచారు. కానీ చిత్రంగా ఎన్నికలకు ఏడాది ముందే పవన్ ప్లేట్ మార్చారు. రాబోయే ఎన్నికల్లో గత ఎన్నికలలాగే టిడిపి తో కలిసే ప్రయాణించే వీలుందని సంకేతాలు పంపారు. టిడిపి తో పొత్తు తోనే పవన్ కొన్ని స్థానాలకే పోటీ చేస్తారని తేలిపోయింది. దాంతో జనసైనికుల్లో నీరసం వచ్చింది.
పవన్ గాలి తీసేసారా ...?
సీఎం సీఎం అంటూ తాము ఎంతో కష్టపడి చేస్తున్న స్లొగన్స్ కి అర్ధం లేదా అనుకుంటూ పవన్ అభిమానులు డీలా పడితే ఏపీ ప్రజలు పికె లో క్లారిటీ లోపించడం పై ఆయనకు పార్ట్ టైం పాలిటిక్స్ అంటేనే ఇష్టమనే భావిస్తున్నారు. ఈ సమయంలో రజనీకాంత్ తాజాగా చేసిన పొలిటికల్ ఎంట్రీ జనసేన అభిమానుల్లో అలజడి రేపుతోంది. సూటిగా స్పష్టంగా తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించడం 234 స్థానాల్లో తాను స్థాపించబోయే పార్టీ పోటీ చేస్తుందని రజనీకాంత్ తేల్చేయడం అంతా చర్చించుకుంటున్నారు. పవన్ లో ఇలాంటి క్లారిటీ ఎందుకు లేదని మధన పడుతున్నారు. ఎవరికో కొమ్ము కాసి గత ఎన్నికల్లో పార్టీ ఇమేజ్ స్వయంగా డామేజ్ చేసుకున్నారని ఈసారి అదే ధోరణి జనసేన ఉనికికే ప్రమాదం తెచ్చి పెట్టేలా ఉందని కొందరు వాపోతున్నారు.
అధికారం లేని సేవ ఎలా సాధ్యం ...
ఎన్ని స్థానాల్లో గెలిచినా గెలవకపోయినా రాజ్యాధికారం కోసం పోరాడాలని అధికారం లోకి రాకపోయినా ప్రతిపక్షంగా వుంటూ ప్రజల పక్షాన పోరాటం సాగించాలిసింది పోయి మరో రకమైన వ్యూహం చేటు తెస్తుందన్నది వారి భావన. తమిళ సూపర్ స్టార్ బాటలో పవన్ వెళ్ళితే జనసేన కు ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా లేకపోయినా భవిష్యత్తు రాజకీయాలు శాసిస్తారని ముందే తెల్లజెండా ఊపితే లేదా రాజకీయాల్లో అనుభవం అంటూ, సీట్లు ఆశించి రావొద్దంటూ, అధినేతే వ్యాఖ్యానించడం, పగ ప్రేమ అంటూ ప్రజారాజ్యం కోసం చెప్పడం ,ఇలా చిత్ర విచిత్ర వాతావరణం కల్పించడం ఆత్మహత్య సాదృశ్యమని వాపోతున్నారు మరికొందరు. రాజకీయాల్లోకి వచ్చే వారికీ స్పష్టత ఉండాలని రజనీకాంత్ ఆలస్యంగా పాలిటిక్స్ లోకి వచ్చినా లేటెస్ట్ ట్రెండ్ సెట్ చేస్తారన్నది పికె అభిమానుల అంచనా.