ఏపీ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రఘువీరా రెడ్డి ఇటీవల ఓ పిలుపు నిచ్చారు. 2014లో ఉమ్మడి ఏపీ విభజన జరిగిన నేపథ్యంలో ఏపీని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ యేనని భావించిన కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని, వారంతా తిరిగి రావాలని, పార్టీని తిరిగి అధికారం దిశగా నడిపిద్దామని సంచలన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వాదులు ఎవరైనా ఈ పిలుపును స్వాగతిస్తారు. అయితే, అలా వెళ్లిన వాళ్లు తిరిగి వస్తారా? రఘువీరాకు అంత సీన్ ఉందా? అసలు రఘువీరాకు ఎంత మంది కలిసి వస్తున్నారు? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. నిజానికి ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఏ ఒక్కరూ సాహసించే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం.. ఆ పార్టీకి ఉన్న బలమైన శక్తి కార్యకర్తలు ఇప్పుడు వివిధ పార్టీల్లోకి జంప్ చేయడమే.
జెండా మోసే వారేరీ...?
నేతలను తయారు చేసుకోవచ్చేమో.. కానీ, కార్యకర్తలను తయారు చేయలేరన్నది రాజకీయ పండితుల మాట. మరి జెండా మోసే కార్యకర్తే లేనప్పుడు పార్టీని ఏ విధంగా నడిపిస్తారో.. రఘువీరానే తేల్చి చెప్పాలి. ఒకవేళ తాను ముందుండి నడిపిద్దామన్నా.. తనతో కూడి వస్తున్నవారు వేళ్లమీద లెక్కించదగిన వారిగానే ఉండిపోయారు. దీంతో గతంలో ప్రారంభించిన పాదయాత్ర కూడా విఫలమైన ప్రయోగంగా మిగిలిపోయింది. ఇక, ఇప్పుడు పార్టీ పునరుజ్జీవం అంటూ కొత్త పల్లవి అందుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుందా? అనేది ప్రశ్న. పార్టీని కాదని వెళ్లినవారు ఎవరూ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే...
కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలోనూ నేతలు కూడి వచ్చే పరిస్థితి లేదు. పోనీ, ఈ మూడేళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ ఏమన్నా పుంజుకుందా? అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి! ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు ఏ ఒక్కరూ సరైన ప్రణాళికతో ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం అంటే ఒక్కటీ నిర్వహించింది లేదు. దీంతో అసలు రాష్ట్రంలో పార్టీ ఉందా? అనే ప్రశ్నకూడా ఉత్పమవుతోంది. ఈ క్రమంలో రఘువీరా ఇచ్చిన పిలుపును తప్పు పట్టకపోయినా.. రాజకీయ పండితులు సూచిస్తున్న సలహా ఏంటంటే.. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలను ముందు ప్రజల్లోకి పంపాల్సిన అవసరాన్ని రఘువీరా గుర్తించాలి.
పోటీ చేసే వారైనా ఉన్నారా?
అనేక మంది నేతలు పదవులు అనుభవించి ప్రస్తుతం పార్టీలోనే ఉన్నారని (వెళ్లిపోయిన వారు కాదు), వారందరినీ మళ్లీ తీసుకువచ్చి ఉద్యమాలకు లేదా సభకు అవకాశం కల్పించుకోవడం ద్వారా రఘువీరా అడుగులు పరిగెడతాయని అంటున్నారు. మరి రఘువీరా ఆ దిశగా అడుగులు వేస్తేనే ఫలితం ఉంటుందని కూడా చెబుతున్నారు. లేదంటే.. పార్టీ పరిస్థితి పాత చింతకాయ్ మాదిరిగానే అయిపోతుందని అంటున్నారు. 2019 ఎన్నికలకు మరో యేడాదిన్నర టైం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కూడా బలమైన వారిని నిలబెట్టడం రఘువీరాకు పెద్ద సవాల్ లాంటిదే.